KTR: అవును కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని మమ్మల్నీ అడుగుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చాలా మంది ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR: అవును కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని మమ్మల్నీ అడుగుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైతే డబ్బులు కూడా ఇస్తామని పలువురు ముందుకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాట్ కామెంట్స్ చేశారు. మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం అని ప్రభాకర్ రెడ్డితోనే (Kotha Prabhakar Reddy) కాదు చాలా మంది మాతోనూ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని అవసరం అయితే చందాలు వేసుకుని ఇస్తామని అంటున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ మేము ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మీ ప్రభుత్వాన్ని మేము పడగొట్టుడేందన్నారు. మీరు చేసే పనులను భరించలేక ప్రజాగ్రహం మొదలైతే దానికి ఎవరేం చేయగలరు?. ప్రజలు మా వద్దకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు భరించాలి అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు వచ్చినట్లు ప్రజలే తరిమేస్తారు. ప్రజాగ్రహంలో ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారన్నారు. మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ మాకు లేదు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి. సీఎంగా రేవంత్ రెడ్డినే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అప్పుడే కాంగ్రెస్ అంటే ఓటు వేయడానికి మరో 20 ఏళ్లు ముందుకు రారని అన్నారు. ఈ దేశ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మొన్న తెలంగాణలో కూడా మా ఎమ్మెల్యేలను పది మందిని తీసుకున్నారు. పార్టీ మారిన వారు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకే తెలియడం లేదు.

బీజేపీకి నెలాఖరు వరకు గడువు:

కంచగచ్చిబౌలి భూములపై (Kancha Gachibowli Lands) సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. భూముల కోసం పోరాడిన విద్యార్థులు, ప్రజాసంఘాలను అభినందిస్తున్నామన్నారు. మేం గతవారం రోజులుగా ఏం చెప్పామో సెంట్రల్ ఎంవర్డ్ కమిటీ అదే చెప్పిందన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని సెంట్రల్ కమిటీ చెప్పింది. కమిటీ సూచన ప్రకారం విచారణ జరిపిస్తే ఆ బీజేపీ ఎంపీతో సహా అందరూ దొరుకుతారు అన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ మాటలు చెప్పడం కాదని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక దోపిడీ, పర్యావరణంపై అరాచక దాడి విషయంలో ప్రధాని స్పందించాలని లేకుంటే ఈ పాపంలో మీకూ వాటా ఉందని అనుకోవాల్సి వస్తుందన్నారు. అన్ని రకాల నిబంధనలు తుంగలోకి తొక్కి పర్యావరణ హననానికి పాల్పడి, భారీ అవినీతికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై వెంటనే సీవీసీ, సీబీఐ, ఎస్ఎఫ్ఐవో, ఆర్బీఐ, సెబీ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చర్యల కోసం ఈ నెలాఖరు వరకు చూస్తాం. అయినా చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీ వైఖరిని ఎండగడతామన్నారు. బీజేపీ డైలాగులు కొడితే సరిపోదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆపదలో ఉంటే వస్తానని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎలాగు వారి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇక్కడికి రారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆత్మాభిమానం ఉన్న ఏ సీఎం అయినా రాజీనామా చేసేవారు. కానీ రేంత్ రెడ్డికి ఆతమాభిమానం లేదని విమర్శించారు. కంచగచ్చిబౌలి భూముల్లో జింకలు లేవని గుంటనక్కలు ఉన్నాయని సీఎం చెప్పారు. ఆ గుంట నక్కలెవరో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

దూకుడు దోపిడీ అంతా సీఎందే:

కంచగచ్చిబౌలి భూముల విషయంలో దూకుడు, దోపిడీ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే (CM Revanth Reddy) కానీ బలిపశువులుగా అధికారులను చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాపై ఆరోపణలు చేస్తే మంత్రి హోదాలో నేనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పాను. అందులో ఎవరో అధికారులను నేను బలిపశువును చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటకు రావాలి. ఈ అంశంలో నిజాలు చెప్పాలన్నారు. ఇందులో అధికారులను బలిపశువులను చేస్తామంటే కుదరన్నారు. నీది కాని 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్నది తప్పు కాదా?, యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా?, ఆర్థిక సంస్థలను మోసం చేసిన సీఎంను, టీజీఐఐసీ సంస్థను విచారించకపోతే కేంద్ర ప్రభుత్వం తప్పుకాదా అని ప్రశ్నించారు. కొంత మంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్నారు. చట్టప్రకారం నడుచుకోని అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం ఊచలు లెక్కపెట్టేలా చేస్తామని హెచ్చరించారు.

రెండు ఢిల్లీ పార్టీలో దొందు దొందే:

బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు ఢిల్లీ పార్టీలు ఒక్కటేనని ఈడీ అనే సంస్థను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. వారి అవసరాలకు అవతలివాళ్లను వేటాడడానికి గతంలో కాంగ్రెస్ సీబీఐని దుర్వినియోగం చేస్తే ఇవాళ బీజేపీ ఈడీని దుర్వినియోగం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అదే ఈడీ ఇతరులపై కేసులు పెటితే కాంగ్రెస్ కు సంబరంగా ఉంటుంది. కానీ తమ వరుకు వచ్చే సరికి ఇబ్బంది అవుతుందన్నారు. ఈడీ మంచిదా చెడ్డదా కాంగ్రెస్ పార్టీకి ఓ క్లారిటీ ఉండాలన్నారు.

Next Story