మా రక్తం తీసుకొని మీ రక్త దాహం తీర్చుకొండి.. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్

by Malleboina Mahesh |

నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతారా? మా రక్తం తీసుకుని రైతుల పొలాలకు నీళ్లివ్వండంటూ సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

మా రక్తం తీసుకొని మీ రక్త దాహం తీర్చుకొండి.. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: నీటి కొరత విషయంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పిన సమాధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. అందులో “రైతులకు కావాల్సిన నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచి.. ఇంకా తీరలేదా మీ రక్త దాహం అంటూ ప్రశ్నించారు. అలాగే 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా..? తెలంగాణ రక్తం రుచి మరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?, తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసిన ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేర్లు పారించిన నరహంతకులు మీరు.

1952లో ఏడుగురు యువకులను కాల్చి చంపి రక్తం కళ్ల చూసిన రాక్షసులు మీరు, 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు, మలిదశ పోరాటంలో వేయి మందిని బలితీసుకున్న మృగాలు మీరు. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినాయి. నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం. నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం. మీ రక్త దాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జల దాహం తీర్చండి" అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story