- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరణ మృదంగం మోగుతుంటే విజయోత్సవాల డ్రామాలు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
కౌలురైతుది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కౌలురైతుది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మరణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా కౌలు రైతు వీడియో పోస్ట్ చేశారు. కౌలు రైతులకు కూడా ఏటా రూ. 15,000 రైతు భరోసా ఇస్తామని మాటిచ్చి ముఖ్యమంత్రి మోసం చేయడం వల్లే ఈ రైతన్న నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఫైర్ అయ్యారు.
పెట్టుబడి సాయం మాట దేవుడెరుగు, కనీసం ఇటీవలి తుఫాను వల్ల నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించినా ఈ కౌలు రైతు కుటుంబం రోడ్డున పడేది కాదన్నారు. ఓ వైపు 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలతో రాష్ట్రంలో మరణమృదంగం మోగుతుంటే రేవంత్ సర్కారు విజయోత్సవాల పేరిట డ్రామాలు చేయడం సిగ్గుచేటన్నారు. రియల్ ఎస్టేట్ దందాలు, కుంభకోణాలు తప్ప కర్షకుల కష్టాల గురించి కనీస అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్లే వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు.
కౌలు రైతు వీరన్న సెల్ఫీ వీడియో చూసిన తర్వాతైనా రేవంత్ ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో అన్నదాతలకు చేసిన మోసాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మోగుతున్న ఈ చావుడప్పును ఇకనైనా ఆపకపోతే కాంగ్రెస్ సర్కారుకు లక్షలాది మంది రైతులే సమాధి కడతారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న వీరన్న కుటుంబానికి కనీసం 25 లక్షల పరిహారం అందించి, కష్టాల కడలి నుంచి ఆ కుటుంబాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.






