నిరుద్యోగుల ఓట్లతో గెలిచి మొహం చాటేసిన కాంగ్రెస్ : కేటీఆర్ ఫైర్

by Ramesh Naini |

నిరుద్యోగ విద్యార్థి యువతకు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

నిరుద్యోగుల ఓట్లతో గెలిచి మొహం చాటేసిన కాంగ్రెస్ : కేటీఆర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగ విద్యార్థి యువతకు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ముషీరాబాద్‌లో పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్‌గాంధీని తీసుకొచ్చి అడ్డగోలు హామీలిచ్చి మోసం చేశారన్నారు. విద్యావంతులైన యువకులతో ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా కనీసం మొహం కూడా చూపించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే తిరిగి వచ్చి అండగా నిలబడతానని మాయమాటలు చెప్పిన రాహుల్‌గాంధీ వారిని నట్టేట ముంచారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందే లేదు అని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకుందన్నారు.

ఎస్ఐఆర్‌పై అప్రమత్తత ఉండాలి

రాష్ట్రంలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జాగ్రత్తగా ఉండాలని.. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన అవకతవకలపై జాగ్రత్త వహించాలని కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్‌పై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. పార్టీ తరఫున ఎంపిక చేసిన బూత్ లెవెల్ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు. బీఎల్ఏలు ప్రతి ఒక్కరి ఓటు తొలగకుండా కాపాడేలా ప్రయత్నం చేయాలన్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అడ్డగోలుగా డబుల్ ఓట్లను, దొంగ ఓట్లను రాయించే ప్రమాదం ఉన్నదని.. వీటిని అరికట్టేలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు.. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, హైదరాబాద్‌లో అద్భుతమైన విజయం సాధించిందని.. నగర ప్రజలు బీఆర్ఎస్ వెంట నిలిచారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు, పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్లలో హైదరాబాద్ నగరానికి చేసిన అభివృద్ధితోనే ఇది సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ చేసిందేమీ లేదని.. హైడ్రా పేరిట వేల ఇండ్లను కూల్చారని తెలిపారు. అలాగే.. వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో డిజిటల్ రూపంలో జరిగే ఈ సభ్యత్వానికి సంబంధించి పార్టీ శ్రేణులకు బూత్ వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇస్తామని తెలిపారు.

రేవంత్ రెడ్డి రెన్యూవల్ సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెక్కారని.. ఆయన రెగ్యులర్ సీఎం కాదని, రెన్యూవల్ సీఎం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం పంపి తన కుర్చీని కాపాడుకుంటున్నారని, ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులు మాత్రమే ఆయన ఉద్యోగం ఉంటుందని అన్నారు. ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ బడుగుల‌కు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ఈ ద్రోహానికి రేవంత్‌రెడ్డితోపాటు రాహుల్‌గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.

చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లు

చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం మొత్తం 72 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక 72 శాతం కాదు కదా, 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా అడ్డగోలు జీవోలను తెచ్చారని మండిపడ్డారు. చివరికి గురుకుల పాఠశాలల్లో స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా దక్కకుండా చేస్తూ జీవో 17 తీసుకువచ్చారని ఆరోపించారు. ఆ జీవో రద్దయ్యే వరకు, బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం ఇద్దరికే దక్కుతున్నాయని.. రేవంత్‌రెడ్డి బామ్మర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకుకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం వాళ్ల బంధువులకే కాకుండా, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులు, చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ సర్కార్‌కు ఉన్నదా అని సవాల్ విసిరారు. 2028లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు 50 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ తీసుకుంటారని హామీ ఇచ్చారు.

Next Story