ఓవైపు భారీ వరదలు.. నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం : కేటీఆర్ ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2025-08-27 11:29:47  IST  )

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఓవైపు భారీ వరదలు.. నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం : కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 'గత 24 గంటల్లో ఎడతెరిపిలేని వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.

కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు కూడా అందుబాటులో లేకుండా పోయింది' అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. జాతీయ రహదారి 44తో పాటు, అనేక అంతర్ జిల్లా రహదారులు కూడా కొట్టుకుపోయాయని, కామారెడ్డి నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న కార్మికులు, హవేలీ ఘనపూర్ తాండాలో గిరిజనులు ఇండ్లపై ఎక్కి ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదని విమర్శించారు.

Next Story