KTR: హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. కేటీఆర్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

హైడ్రా (HYDRA) పనితీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) ఫైర్ అయ్యారు.

KTR: హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా (HYDRA) పనితీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) ఫైర్ అయ్యారు. ఆ సంస్థ కాంగ్రెస్ సర్కార్‌ (Congress Government)కు చెడ్డపేరు తెస్తోందని.. ఓ వైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తున్నారని.. కానీ, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆయన అసెంబ్లీ (Assembly) లాబీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వంలోని పెద్దలు వసూళ్ల దందా చేపడుతుున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని.. ఫార్మా సిటీ పేరుతో భూములను చెరబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఫోర్త్ సిటీ సాకుతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుటుంబం ఏకంగా రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం మొదలు పెట్టిందని అన్నారు. రిజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) పేరుతో భూములను ఆక్రమిస్తూ.. పేదలపై ప్రతాపం, పెద్దలతో ఒప్పందాలు చేసుకుంటున్నాని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్న నాడు.. మద్యం అమ్మకాలపై ఏకరువు పెట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party).. నేడు మద్యం ముద్దు అంటోందని ఫైర్ అయ్యారు. ధరల సవరణ, కొత్త బ్రాండ్ల పేరుతో అక్రమ ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికలు సందర్భంగా ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొదిలి.. ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా రావట్లేదని, రుణ మాఫీ చేయట్లేదని అన్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్.. ఓ బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇవ్వరు.. ఉద్యోగాలు వేయరని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ (KCR) గారి పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణ (Telangana)ను 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధపాతాళానికి తొక్కేశారని ఆక్షేపించారు. ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రాన్ని ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని అన్నారు. ఇది పాలన కాదు పీడన అని.. ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌‌గా మారాయి.

Next Story