ఎవరిని ఉరి తీయాలో చెప్పాలి? ఒక తండ్రిగా అయినా రేవంత్ చర్యలు తీసుకోవాలి : కేటీఆర్ ఆవేదన

by Ramesh Naini |

గురుకుల విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు, విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరిని ఉరి తీయాలో చెప్పాలి? ఒక తండ్రిగా అయినా రేవంత్ చర్యలు తీసుకోవాలి : కేటీఆర్ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: గురుకుల (Gurukulas) విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు, విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్క సంవత్సర కాలంలో వేల మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో (food poisoning) ఫుడ్ పాయిజన్‌కు గురవడం, వంద మందికి పైగా విద్యార్థులు చనిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. రాష్ట్ర సీఎం, విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలు జరిగిన తరువాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రేవంత్ నియంతృత్వ, అమానవీయ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఇంత మంది విద్యార్థులు అనారోగ్యం పాలైనా, ఆత్మహత్యలు చేసుకున్నా, మరణాల పాలయ్యినా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని తెలిపారు. గురుకుల విద్యాసంస్థల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్, మరణాల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి అనేక సార్లు తీసుకువచ్చిన ప్రతిసారీ.. రాష్ట్ర మంత్రులు కంటి తుడుపు చర్యలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క సమీక్ష చేయడానికి కూడా సమయం కేటాయించలేక పోయారని తెలిపారు.పిల్లలు కలిగిన ఒక తండ్రిగా అడుగుతున్న.. ఈ అంశంలో ముఖ్యమంత్రిగా కాకుండా కనీసం ఒక తండ్రిగా అయినా రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే సీఎం ఊరుకుంటాడా? ఇదే పరిస్థితి సీఎం పిల్లలకు జరిగితే కూడా ఇలానే వదిలేస్తారా? దయచేసి ముఖ్యమంత్రి ఈ అంశాన్ని గంభీరంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు నష్టపోతే మీరు ఊరుకుంటారా? మీ పిల్లలకు ప్రభుత్వం విషం కలిపిన ఆహారం పెడితే మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గతంలో అన్నట్లే ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఎవరిని ఉరి తీయాలో చెప్పాలని విమర్శించారు.

Next Story