కేటీఆర్​కు ఆ నైతిక హక్కు లేదు.. రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి

by Ramesh Goud |

రాష్ట్రంలోని రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్​కు లేదని, ఖమ్మంలో రైతులకు బేడీ వేసిన సంగతి మరిచిపోలేని సంఘటన అని రైతు కమిషన్​చైర్మన్​ కోదండ రెడ్డి విమర్శించారు.

కేటీఆర్​కు ఆ నైతిక హక్కు లేదు.. రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్​కు లేదని, ఖమ్మంలో రైతులకు బేడీ వేసిన సంగతి మరిచిపోలేని సంఘటన అని రైతు కమిషన్​చైర్మన్​ కోదండ రెడ్డి విమర్శించారు. ఇందిరా గాంధీ పేదలకు ఇచ్చిన భూములను వేలం వేసి అమ్ముకున్నారని, అధికారంలో ఉండగా భూ రికార్డుల సవరణ పేరుతో ధరణి అనే వ్యవస్థను తెచ్చి ఐటీ శాఖా మంత్రిగా రైతుల భూముల వివరాలు, ఆధార కార్డ్, బ్యాంకు ఖాతా నంబరు విదేశీ కంపెనీకు ఇచ్చారని మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కేసీఆర్​ రెవెన్యూ మంత్రిగా ఉండి 30 లక్షల ఎకరాల భూమిని నిషేదిత జాబితాలో పెట్టి తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమి హక్కును రద్దు చేశారని మండిపడ్డారు.

ధరణి దేశంలోనే ఒక భూ కుంభకోణం దీంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని, కుటుంబంతో సహా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి బీఆర్​ఎస్​పార్టీ నేతలదని, ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే నిపుణులంతా వ్యతిరేకించారని, అయినా అనుమతులు లేకుండా అదరా బాదరాగా నిర్మాణాలు చేసి చివరకు ప్రాజెక్ట్ కూలిపోయేలా చేసి జేబులు నింపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతిని ఎవరు నియంత్రించలేరని, కరువు కాటకాలు, వరదలు, వడగాళ్ల వాన, పిడుగులు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ రైతు వ్యవసాయం చేస్తుంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాల్సింది పోయి రైతు సమస్యలను రాజకీయం చేయడం నీచమైన సంప్రదాయమన్నారు.

బీఆర్​ఎస్​ ఓడిపోయినప్పటి నుంచి పదే పదే తెలంగాణ సెంటిమెంట్ తో మాట్లాడడం ప్రజలను రెచ్చగొట్టడం కేసీఆర్​కుటుంబానికి అలవాటైపోయిందని ఆరోపించారు. టీఆర్​ఎస్​పార్టీని బీఆర్​ఎస్​గా మార్చుకున్న రోజే తెలంగాణ పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. ఆసలు ప్రతి పక్షంగా కూడా పనికిరారు. ఎన్నికలైన తరువాత ప్రజా తీర్పు మేరకు ప్రతిపక్ష స్థానం ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా అన్నీ హోదాలు అనుభవిస్తూ శాసన సభకు అడుగుబెట్టకపోవడం రాష్ట్ర చరిత్రలో మొదటి సారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story