- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.1600 కోట్ల బొగ్గు కుంభకోణం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సింగరేణిలో జరిగిన భారీ బొగ్గు కుంభకోణంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో జరిగిన రూ.1600 కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. సింగరేణి నిల్వల నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని, స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అప్పనంగా అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. నైని కుంభకోణం మొదలుకొని.. వందల అక్రమాలు జరిగినా ఇంతవరకూ కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బొగ్గు నిల్వల్ని తనిఖీ చేసే సంబంధిత శాఖగానీ.. కాగ్ అధికారులు కానీ ఇప్పటి వరకూ ఎందుకు తనిఖీలు చేయలేదని నిలదీశారు. సింగరేణి బొగ్గు అంటే తెలంగాణ ప్రజల ఆస్తి అని, అలాంటి ఆస్తిని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని మనుగడనే దెబ్బతీస్తున్నాయని.. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డితో మిలాఖాత్ లేకుంటే వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్వయంగా కిషన్ రెడ్డే బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉండగా.. రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన కుంభకోణం జరగడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7,20,00 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్ లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం-1 లో ఆరు లక్షలు, రామగుండం-2 లో నాలుగు లక్షలు, భూపాలపల్లిలో 5 లక్షల 40 వేలు, ఇల్లందులో 3 లక్షల 50 వేలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు ఇతర వాటిని కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని లెక్కలు చూపించారు. కానీ కోల్ స్టాక్ పాయింట్ల దగ్గర ఆ బొగ్గు లేకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద ఆధారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం, రాష్ట్రం కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయా అనే బలమైన అనుమానం కార్మికలోకాన్ని వెంటాడుతోందన్నారు. ఈ స్కాంను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిల పక్షాన్ని ఆయా గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
అసలు బొగ్గు ఉత్పత్తి కోసం కోల్ ఇండియా పాటించే విధానాలేంటి? కాంగ్రెస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ను ఎవరి ప్రయోజనాలు ఆశించి పెట్టారు? చివరికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఎలా పక్కదారి పట్టించారు ? అనే అంశాలపై వాస్తవాలను బయటపెట్టకపోవడం కాంగ్రెస్ ముఖ్యమంత్రితో మీకున్న లోపాయికారి ఒప్పందాలను బట్టబయలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. అన్ని టన్నుల బొగ్గు ఏమయిందో వెంటనే విచారణ జరిపించి నిజానిజాలేంటో తేల్చి.. బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. సింగరేణి సంస్థను కోలుకోని విధంగా దెబ్బతీసే ఈ కుంభకోణంపై ఒకవేళ విచారణ జరపకపోతే కార్మికలోకంతో కలిసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తుందని హెచ్చరించారు.






