ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని అమలు చేయాలి : కేటీఆర్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పొడగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానాన్ని అమలు చేయాలి : కేటీఆర్
X
  • అనర్హులను జాబితా నుంచి ఏరివేయాల్సిందే..
  • కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు త్వరలో ఢిల్లీకి బీఆర్ఎస్ బృందం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పొడగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్ఓలు అనేక ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్ఓలు పంపిణీ చేసిన ఎస్‌ఐఆర్ ఫారాలను ఇప్పటివరకు కేవలం 7 శాతం మంది మాత్రమే నింపి సమర్పించారని.. జూలై 24 చివరి తేదీలోగా మిగిలిన 93 శాతం ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఐఆర్ గడువును తప్పనిసరిగా పొడిగించాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో డూప్లికేట్ ఓట్లపై దృష్టి సారిస్తున్న ఎన్నికల కమిషన్, ఒకే వ్యక్తి పేరు వివిధ రాష్ట్రాల ఓటరు జాబితాల్లో ఉన్న అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే డిమాండ్‌తో త్వరలోనే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తుందని వెల్లడించారు.

బీఆర్ఎస్ తరఫున రాష్ట్రవ్యాప్తంగా నియమించిన బీఎల్‌ఏలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఇకపైనా అప్రమత్తంగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 93కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌ఏలకు అవగాహన సమావేశాలు నిర్వహించామని, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్.రమణకు కరీంనగర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌కు నల్లగొండ, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు రంగారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్‌కు ఖమ్మం, మన్నె క్రిశాంక్‌కు మెదక్, వై.సతీష్ రెడ్డికి వరంగల్, అభిలాష్ రంగినేనికి మహబూబ్‌నగర్, ముజీబ్‌కు ఆదిలాబాద్, సుమిత్రానంద్‌కు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బాధ్యతలను అప్పగిస్తూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేటీఆర్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు త్వరలో ఢిల్లీకి బీఆర్ఎస్ బృందం వెళ్తుందని చెప్పారు.

Next Story