కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదు : కేటీఆర్

by Naga Rani Yarlagadda |

కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.

కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదు : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) పై ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల్ని మరింత మెరుగు పరిచి.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని స్థాపించి, జిల్లా, మండల కేంద్రాల్లో నూతన ఆస్పత్రులు, పట్టణ ప్రాంత పేదల కోసం బస్తీ దవాఖాలను నెలకొల్పిన ఘనత కేసీఆర్ (KCR)కే చెందుతుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలన్న సంకల్పంతో, ఒక బృహత్ ప్రణాళికతో నగరానికి నలువైపులా 1000 పడకల నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ నగరానికే తలమానికంగాఉండేలా 2200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, 2 వేల బెడ్స్ తో నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేయడం ఎవరితరం కాదన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ సర్కార్ వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల నిర్మాణాలకు సంబంధించిన విజువల్స్ ను షేర్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నిర్మాణాలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేయకపోతే ఈపాటికే సరికొత్త హంగులతో ప్రజలకు ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చేవన్నారు. వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాటి నిర్మాణాలను పూర్తిచేసి వైద్య సేవల్ని ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story