KTR: చివరకు కాళేశ్వరమే మీకు దిక్కైంది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-09-08 09:16:17  IST  )

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

KTR: చివరకు కాళేశ్వరమే మీకు దిక్కైంది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పు పట్టే సీబీఐకి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును అప్పగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ప్రజల సొమ్ముతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కేసును సీబీఐకి అప్పగించారని మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు చివరకు కాళేశ్వరమే దిక్కైందని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా తల వద్ద శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ వద్ద శంకుస్థాపన చేస్తే కాళేశ్వరం పేరు చెప్పాల్సి వస్తుందని తోక అయిన గండిపేట వద్ద సీఎం శుంకుస్థాపన చేయబోతున్నారని విమర్శించారు. పత్రికలలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ప్రకటనలు ఇచ్చారన్నారు. కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిన వారే ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు తెచ్చి హైదరాబాద్ ప్రజలుక నీళ్ళు ఇస్తామని అంటున్నారంటే తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెప్పక చెప్పినట్లు అయిందన్నారు. గండిపేటకు తీసుకువస్తున్నవి కాళేశ్వరం నీళ్లా కాదా దీనికి సీఎం సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. కాళేశ్వరం నీళ్లతో వచ్చే కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టును బద్నం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉందని ఎద్దేవా విమర్శించారు. గుండెకాయను వదిలి గండిపేట వద్ద శంకుస్థాపన చేస్తున్నారంటే ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరన్నారు.

కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం అయిందని ఆరోపిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి 94 వేల కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో ఓ వైపు నీళ్లు కనిపిస్తుంటే లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుందని కొట్టిపారేసినా సీఎం బుద్ధి మారడం లేదని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక్క బ్లాక్ కోసం రూ. 250-300 కోట్లు ఖర్చు అయింది. ఎన్డీఎస్ ఏ రిపోర్టు ప్రకారం మేడిగడ్డలో 7వ బ్లాక్ ఒక్కటే రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పారు. మరి మేడిగడ్డలోని ఏడవ బ్లాక్ ను పునర్మిరిస్తామని ఏజెన్సీనే ముందుకువస్తే ప్రజల సొమ్ము ఎక్కడ వృథా అయిందని సీఎంను ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఒక్కరూపాయి కూడా వృథా కాలేదన్నారు. ఓ వైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ మరో వైపు చిల్లర ప్రచారం చేస్తున్నందుకు సీఎం ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

విడుతల వారీగా స్కామ్ లు:

18 మే 2023న నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో రూ. 11 వందల కోట్ల వ్యయంతో కొండపోచంపల్లి నుంచి భాగ్యనగరానికి నీళ్లు తీసుకువచ్చేందుకు చర్చించి ఆమోదించారు. జంట జలాశయాలతో పాటు హుస్సెన్ సాగన్ కు గోదావరి జలాలు తీసుకువచ్చే ప్రణాళికలు చేశామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏడు రేట్లు పెంచి రూ. 7400 కోట్ల వ్యయం పెంచారని మండిపడ్డారు. కేవలం గ్రావిటీ ద్వారా కేవలం రూ. 11 వందల కోట్లతో పూర్తయ్యే ఈ పనికి ఎందుకు ఈ వ్యయం పెంచారని ప్రశ్నించారు. ఇది స్కామ్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ లను కూడా విడతల వారీగా చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం రూ. 7400 కోట్లతో ఎవరు అడగని ఈ ప్రాజెక్టును ఎందుకంత అవసరం వచ్చిందో సీఎం చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టు వెనకాల అవినీతి కోణంతో పాటు క్రిమినల్ కోణం కూడా ఉందన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో కాంట్రాక్టును బ్లా్క్ చేయాలని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి రిపోర్టు ఇచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఏ ఏజెన్సీని అయితే బ్లా్క్ లిస్ట్ చేయాలో మళ్లీ వారికే రూ. 7400కోట్ల పనులు ఇచ్చారు. దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో ప్రశ్నించారు. ఇది దోపిడి తప్ప మరొకటి కాదన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు కొల్లగొట్టి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకునే చర్య అని ఆరోపించారు.

Next Story