సమయం సందర్భం ఉండక్కర్లేదా? AI సమ్మిట్‍లో కాంగ్రెస్ నిరసనలపై కేటీఆర్ విమర్శలు

by Prasad Jukanti |

కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ మూర్ఖత్వం కృత్రిమ మేధస్సును మించిపోయిందని కేటీఆర్ విమర్శించారు. ఎస్ఎల్‍బీసీ పై స్పందించారు.

సమయం సందర్భం ఉండక్కర్లేదా? AI సమ్మిట్‍లో కాంగ్రెస్ నిరసనలపై కేటీఆర్ విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ మూర్ఖత్వం కృత్రిమ మేధస్సును (Artificial Intelligence) మించిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని కాంగ్రెస్‌పై (Congress) మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ పై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. ఏఐ సమిట్‌ వద్ద యువజన కాంగ్రెస్‌ నిరసనపై స్పందిస్తూ యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం అన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయన్నారు. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ (AI Impact Summit 2026) వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా ఇలాంటి నిరసనలకు వేదిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అదే AI సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం అని ఎద్దేవా చేశారు.

రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట:

కేటీఆర్ మరో ట్వీట్ చేస్తూ ఎస్ఎస్‍బీసీ ప్రమాదంపై స్పందించారు. రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అన్నారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందని సంవత్సరం గడుస్తున్న మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావన్నారు.

Next Story