KTR: ఇందిరమ్మ రాజ్యంలో “బిందె” సేద్యమా?: సీఎంపై కేటీఆర్ సెటైర్

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

KTR: ఇందిరమ్మ రాజ్యంలో “బిందె” సేద్యమా?: సీఎంపై కేటీఆర్ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు తాగునీటితోపాటు సాగునీటికి కూడా రాష్ట్రంలోని ఆడ బిడ్డలు బిందెలు మోస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR విమర్శించారు. ఈ ఆడబిడ్డల బాధలు తీర్చే సోయి ఈ సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఎప్పుడొస్తుందోనన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని రంగధామునిపల్లిలో ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయి 15 రోజులైనా మరమ్మత్తు చేయించకపోవడంతో వరి పంటలను కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లుమోసుకువచ్చిన పొలాల్లో పోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్ ఎక్స్ లో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని అడుగు బయటపెట్టొద్దని కేసీఆర్ గారు సంకల్పిస్తే ఈ ప్రభుత్వం మాత్రం చివరకు మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చుకుని వరి నారు కాపాడుకునే పరిస్థితి కల్పించిందని దుయ్యబట్టారు. ఇప్పటికే తాగునీటి కోసం తండ్లాడుతున్న అక్కాచెల్లెళ్లకు ఈ కొత్త కష్టాలేంటని ప్రశ్నించారు.

రిపేర్ చేయించే సత్తా లేదా?:

ఏడాదిన్నరగా మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు మరమ్మత్తు చేయడం మీకు చేతకావడం లేదు. చివరికి ట్రాన్స్ ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సాగునీటి వసతి కల్పించకుండా ఇప్పటికే చేతులెత్తేశారని కనీసం కరెంట్ మోటర్లతో పంట కాపాడుకుందామంటే కూడా ఇన్ని కష్టాలా? బీఆర్ఎస్ హయాంలో పెరిగిన భూగర్భజలాలను వాడుకునే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం కాక మరేంటన్నారు. కళ్లముందే వరినారు ఎండిపోతుంటే తట్టుకోలేక.. బిందెలతో ఆడబిడ్డలు పడుతున్న అగచాట్లు ఈ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? అని నిలదీశారు.

Next Story