- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేల్చుకుందాం దా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చాలెంజ్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తప్పించుకోలేరని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పని చేస్తోందన్న దమ్ము ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్, రేవంత్ రెడ్డి సత్తా ఏంటో ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇవాళ శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లితో (Serilingampally) పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒక రోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు.
బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా:
కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్ ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. పేదవాళ్ల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు.
మీ అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా?:
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపులలో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు. హైదరాబాద్ ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్ ను కేసీఆర్ మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు.






