కేటీఆర్ ఉల్లిగడ్డ బాంబ్ కూడా వేయలే.. కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్

by Ramesh Goud |   (  Updated:2025-04-12 13:16:42  IST  )

పేదవాళ్లు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపుమంటగా ఉన్నదని, కేటీఆర్ కు ప్రభుత్వంపై బురద జల్లాలని తప్ప ఇంకో పని లేదని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు.

కేటీఆర్ ఉల్లిగడ్డ బాంబ్ కూడా వేయలే.. కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: పేదవాళ్లు సన్న బియ్యం తింటుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపుమంటగా ఉన్నదని, కేటీఆర్ కు ప్రభుత్వంపై బురద జల్లాలని తప్ప ఇంకో పని లేదని భువనగిరి (Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Congress MP Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. గాంధీభవన్ (Gandhi Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన చామల.. ప్రతిపక్ష నాయకుల మాటలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లు కడుపునిండా అన్నం తినాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చెస్తోందని, పేదల కడుపు నిండుతుంటే.. ఈ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వాళ్లు వాళ్లు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. తమ హయాంలో సన్న బియ్యం ఇవ్వలేకపోయామని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఇస్తే.. ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తుందేమో అన్న భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం మంచి పేరుతో ఎల్లప్పుడూ అధికారంలో ఉంటే తాము రాజకీయాలకు కూడా పనికిరామేమో అన్న భయం బీఆర్ఎస్ నేతల (BRS Leaders)ను వెంటాడుతోందని దుయ్యబట్టారు.

ఇక టీజీఐఐసీ (TGIIC) నుంచి 37 కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ. 9,995 కోట్ల 28 లక్షల బాండ్లను కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టడం జరిగిందని, ఈ డబ్బులు టీజీఐఐసీకి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు (ICICI bank) అకౌంట్లో పడితే వాటిని యూటీలైజ్ చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ఇన్వాల్వ్‌మెంట్ ఇంతేనని, దీనికి ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని కేటీఆర్ (KTR) పనికిరాని మాటలన్నీ మాట్లాడిండని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొద్దస్తమానం ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప వీళ్లకు మరో పని లేదని ఎద్దేవా చేశారు.

48 గంటల్లో ప్రెస్ మీట్ పెడుతున్నా అని డెడ్ లైన్ చెప్పి మరీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడని, ఆయన ఏదో పెద్ద విషయం చెప్పబోతున్నాడని అనుకుంటే, కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు.. అర్థంపర్థం లేని ఆరోపణలే తప్ప ఆయన మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రభుత్వంపై ఏదో విధంగా బురద జల్లాలనే కుతూహలం తప్ప ఇంకేం లేదని, హైడ్రోజన్ బాంబేసి (Hydrogen Bomb) అల్లకల్లోలం సృష్టిస్తాడు అనుకుంటే.. చివరికి ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా అతీగతీ లేని ఆరోపణలు చేశాడని ఎంపీ చామల వ్యాఖ్యానించారు.

Next Story