- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిబంధనలు ఇలా ఉంటే బాగుంటుంది.. ఒకసారి ఆలోచించండి’: సీఎస్‌కు కేటీఆర్ ఫోన్
కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్ తరలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్ తరలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత, సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమన్నారు. రైతుల కోసం కేటాయించిన యూరియాను కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్‌మన్ లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల దోపిడీకి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఒక గన్‌మన్ లారీ లోడ్ యూరియా ఎత్తుకుపోతే ఇక కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఎంత దోచుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అలాగే.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వ అలసత్వాన్ని కేటీఆర్ ఖండించారు. రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు, కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను చెల్లించామన్నారు.
గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, రోశయ్య ప్రవేశపెట్టిన కొన్ని పథకాలను కేసీఆర్ కొనసాగించారని.. అయితే కేసీఆర్ పేరు ఉందన్న ఏకైక కారణంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో పట్టపగలే దోపిడీలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, క్రైం రేట్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని తెలంగాణలోని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని.. గులాబీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే మొదలవ్వాలని పిలుపునిచ్చారు. చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉన్న మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకున్న కేటీఆర్, తామంతా కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధించి మాగంటి గోపినాథ్‌కు నివాళి అర్పించాలని కోరారు.
ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలి
మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్థానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కేటీఆర్ సమావేశమయ్యారు. గతంలో పదో తరగతి వరకు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణించే నిబంధన ఉండేదని, ఇప్పుడు 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివిన వారికే స్థానికత వర్తిస్తుందని, వారికే మెడికల్ సీట్ల అడ్మిషన్లు దక్కుతాయని కొత్తగా ఇచ్చిన ఆదేశాల వల్ల వందల మంది విద్యార్థులు నష్టపోతున్నారని వారు వివరించారు. పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన తర్వాత, అత్యుత్తమ శిక్షణ కోసం ఆంధ్రాతో పాటు అనేక నాన్-తెలుగు రాష్ట్రాలలో కోచింగ్‌లు తీసుకుని నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యారని, ఇప్పుడు ఆ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారిని అనర్హులుగా ప్రకటించి ప్రవేశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందని వారు తెలిపారు. సమస్యలను విన్న కేటీఆర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీపరమైన మార్పులు లేదా స్థానికతకు సంబంధించిన అర్హతలను మార్చినప్పుడు, కటాఫ్ డేట్ పెట్టి, రెండు లేదా మూడు సంవత్సరాల సమయం ఇచ్చి అలాంటి నిబంధనలు తీసుకువస్తే బాగుంటుందని సూచించారు. ఈ అంశంలో మానవతా కోణంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






