పేప‌ర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించాలి.. ఎన్నికల సంఘానికి కేటీఆర్ విజ్ఞప్తి

by Ramesh Naini |

పేప‌ర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించాలి.. ఎన్నికల సంఘానికి కేటీఆర్ విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈవీఎంలపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పేపర్ బ్యాలెట్ల (paper ballot)తో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్‌ (Election Commission)ను కోరినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. ఇవాళ (మంగళవారం) కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో భేటీ అయింది. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ లాంటి చాలా దేశాలు కొంత కాలం వరకు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతో ఓటింగ్ మిషన్‌ను వద్దనుకున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ దేశాలన్ని తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతికి వెళ్ళాయని వివరించారు. ఈ ఈవీఎంలపై దేశ ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రజల్లో వాటిపై విశ్వసనీయత కోల్పోయారని తెలిపారు. అందుకే త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

అలాగే కారు గుర్తును పోలిన 8 గుర్తుల వల్ల మాకు చాలా ఎన్నికల్లో నష్టం జరిగిందని, వాటిని వెంటనే తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో పార్టీలు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఇష్టానుసారంగా ఒక వేలం పాట మాదిరి నోటికి వచ్చిన వాగ్ధానాలు చేసి ప్రజలను మోసం చేసి గెలిచిందని ఆరోపించారు. ఈ విషయాలన్నీ కూడా ఈసీకి వివరించినట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పుకుండా ఆ పార్టీని శిక్షించాల్సిన బాధ్యత ఈసీ మీద ఉందన్నారు. అలా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక మోసం చేస్తే వాటి సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా, ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశామని పేర్కొన్నారు.

Next Story