KTR: రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారు.. సీఎంపై కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

ఓటమి భయంతో రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారు.. సీఎంపై కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఓటమి భయంతో రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆరోపించారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్‌ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్‌.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్‌ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ ఇచ్చారని చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందించామన్నారు. ఇలాంటి ఎన్నో పథకాలను రేవంత్‌ సర్కార్‌ బంద్‌ చేసిందని, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, రంజాన్‌ తోఫా బంద్‌, బతుకమ్మ చీరలు బంద్‌, క్రిస్మస్‌ గిఫ్ట్‌.. ఇలా అన్నీ పథకాలను బంద్‌ చేసిందని మండిపడ్డారు.

ప్రజలనే బెదిరించే స్థాయికి రేవంత్ రెడ్డి చేరుకున్నారని కేటీఆర్‌ ఫైరయ్యారు ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ రేవంత్‌ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోగా.. అన్ని బంద్‌ చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్‌ ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మ కర్త అంతే అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్‌ హెచ్చరించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌ తోక కత్తరించాలని పిలుపునిచ్చారు.

Next Story