హంగ్ చోట్ల కాంగ్రెస్ అరాచకాలు.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకెళ్లారు: కేటీఆర్ ఆరోపణలు

by Ramesh Naini |

కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడంతోపాటు ప్రలోభ పెట్టారని, పోలీసులను ఇంటింటికీ పంపించారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

హంగ్ చోట్ల కాంగ్రెస్ అరాచకాలు.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకెళ్లారు: కేటీఆర్ ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దాదాపు 34 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి వేడుకలు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ వేడుకల్లో బీఆర్ఎస్ బంజారా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంబాడా మహిళల సాంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ల‌తో తెలంగాణ భవన్ హోరెత్తింది. భోగ్ బండార్‌లో కేటీఆర్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడంతోపాటు ప్రలోభ పెట్టారని అన్నారు. పోలీసులను ఇంటింటికీ పంపించారన్నారు. గుండాలను ఉపయోగించారని ఆరోపించారు. ‘మా తండాల్లో మా రాజ్యం ఉండాలి’ అన్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. గిరిజన గూడాలు, కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి వేలాది గిరిజన యువతకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారని చెప్పారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారని వివరించారు. అలాగే ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను రక్షించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు. జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.

సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం..

సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తన మద్దతు సీపీఐకి ప్రకటించిందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ, కాంగ్రెస్ ఇప్పటికే అలయన్స్‌లో ఉన్నాయని, కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. అయితే.. ఏఐటీయూసీ వంటి సీపీఐ అనుబంధ సంస్థ కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయో తాను చెప్పలేనని అన్నారు. ఎవరు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం భవిష్యత్తులోనూ పోరాడుతామని స్పష్టం చేశారు.

Next Story