- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KRMB : నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం
కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) సోమవారం ప్రత్యేక సమావేశం కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) సోమవారం ప్రత్యేక సమావేశం కానుంది. నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు తెలుగు రాష్ట్రాల నీటి వాటాలు, ఇతర అంశాలపై అధికారులు కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్(KRMB Chairman Atul Jain) తో చర్చించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ అక్రమంగా జలాలను తరలిస్తోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే గత శుక్రవారమే బోర్డ్ సమావేశం కాగా.. ఏపీ ప్రత్యేక వినతితో దానిని నేటికీ వాయిదా వేసింది. నేడు జరిగే సమావేశంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి రెండు రాష్ట్రాలకు నీటి వాటాలు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించేందుకు ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటి పారుదల ముఖ్య కార్యదర్శితో కేఆర్ఎంబీ చైర్మన్ హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీ అక్రమంగా తరలించుకపోతున్న నీటిని కేఆర్ఎంబీ నిలువరించాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో పాల్గొన్న ఆయన చైర్మన్ అతుల్ జైన్‌కు లిఖిత పూర్వకంగా ఏపీ అనుసరిస్తున్న ధోరణిపై ఫిర్యాదు చేశారు. శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్ నుండి నిబంధనలను ఉల్లంఘించి తరలించుకుపోతున్న నీటిని తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. కేఆర్ఎంబీ రికార్డుల ప్రకారం ఏపీ ప్రభుత్వం తనకున్న హక్కులకు మించి నీటిని వినియోగించుకుందని తెలిపారు. ఏపీ అక్రమంగా నీటిని వినియోగించుకుంటున్న అంశాన్ని 2024 నవంబర్ నుండి ప్రతినెలా కేఆర్ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖల రూపంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయినా కేఆర్ఎంబీ ఏ రోజూ పట్టించుకోకుండా ఉపేక్షించడంతో ఇప్పుడు ఈ సమస్య జఠిలంగా మారిందని తెలిపారు. ఉమ్మడి జలాశయాల నుండి ఏకపక్షంగా నీటిని తరలించుకుపోయే హక్కు ఏపీకి ఎక్కడిదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
అంతేగాకుండా ఈ సంవత్సరం మే నెల మాసాంతానికి గాను తెలంగాణకు తాగు, సాగునీరు 107 టీఎంసీల అవసరాన్ని ఆయన చైర్మన్‌కు వివరించారు. తద్వారా కృష్ణా పరివాహక ప్రాంతంలోని 13 లక్షల ఎకరాలలో వేసిన రబీ పంటలను కాపాడడంతో పాటు, కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన రెండు కోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చాలని రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ 650 టీఎంసీల నీటిని వినియోగించుకుందని.. తెలంగాణ కేవలం 225 టీఎంసీలు మాత్రమే వాడిందని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత 2014-15లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 66:34 కాగా.. ప్రస్తుతం ఏపీ ఒప్పందాన్ని ఉల్లంఘించి 75:25 నిష్పత్తిలో వాడుకుందని ఆయన తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి అవసరమైన తాగు, సాగు నీటి వివరాలను సమగ్రంగా వివరించామని.. ప్రస్తుతం తెలంగాణకు అవసరమైన 116 టీఎంసీల నీటిని అందించాలని కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తక్షణమే విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.






