Koneru Konappa: కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి.. సొంత పార్టీపై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-05-24 07:55:28  IST  )

తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితితులు ఘోరంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Koneru Konappa: కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి.. సొంత పార్టీపై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) కొత్త, పాత లీడర్ల మధ్య పంచాయతీ ముగియడం లేదు. రోజుకో సెగ్మెంట్ లో నేతల మధ్య వైరం పార్టీలో రచ్చగా మారుతోంది. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోనేరు కోనప్ప (Koneru Konappa) మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతిఘోరంగా ఉన్నాయని తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. తాజాగా ఓ కార్యక్రమంలో తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం హామీ ఇచ్చినా కౌటాల బ్రిడ్జికి నిధులు మంజూరు కాలేదని బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. పదేళ్లలో రైతులకు ఏ కష్టం లేకుండా చూసుకున్నా, కానీ ఇప్పుడు పట్టించుకునే వారేలేరని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక అప్పటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో చేరాను. తాను చేరిన తర్వాత గతంలో కంటే ఆ పార్టీకి ఓట్లు భారీగా పెంచగలిగాం. కానీ సిర్పూర్ నియోజకవర్గంపై గానీ, నామీద, నా కార్యకర్తల మీద ప్రేమ లేకుండా కొంత మంది కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు.

గతంలో రాజీనామా ఆ వెంటనే యూ టర్న్:

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సిర్పూర్ నుంచి (Sirpur Constituency) పోటీ చేసి ఓడిపోయిన కోనేరు కోనప్ప పార్లమెంట్ ఎన్నికల సమయంలో మార్చి 2024లో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇఅయితే అక్కడ సరైన గుర్తింపు దక్కడం లేదని, గ్రూప్ తగాదాలతో ఇబ్బందులు తప్పడం లేదంటూ 2025 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసిన 24 గంటల్లోనే రాజీనామా విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. రిజైన్ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసిన కోనప్ప తాను పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నప్పటికీ ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చి అందరిని షాక్ కు గురి చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతగానే కొనసాగుతున్న ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాశంగా మారాయి.

Next Story