- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో ‘కొండా Vs కడియం’.. దేవాదాయ శాఖ సమీక్ష రచ్చరచ్చ!
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు పొమ్మనలేక పోగబెడుతున్నారా? ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారా? ఆమె శాఖలో ఇతరుల జోక్యం, కీలక వవిషయాలపై సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే.. ఆమెకు పదవి గండం ఉందని ముందే సంకేతాలు ఇస్తున్నారా? స్వచ్ఛందంగా పదవి నుంచి తొలిగే విధంగా చేస్తున్నారా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇబ్బందికి గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె అనుచరులు భావిస్తున్నారు. మేడారం జాతర టైంలో ఆమెకు, మంత్రి పొంగులేటికి వివాదం ఏర్పడింది. యాదగిరిగుట్ట దేవస్థానబోర్డు నియామకం సమయంలో కనీస సమాచారం ఇవ్వలేదని ఆమె తన అనుచరుల ముందు ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో కూడా తనకు సమాచారమివ్వకుండానే ఓఎస్డీని తొలగించారని, ఆయనను అరెస్ట్ చేయడానికి తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. ఇలా అనేక విషయాల్లో తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని కొండా సురేఖ తన అనుచరులతో వాపోతున్నట్లు తెలిసింది.
అనుచరుల్లో ఆందోళన
ఉమ్మడి రాష్ట్రంలో కొండా సురేఖ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మదగిన వ్యక్తిగా గుర్తింపుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్లోకి వెళ్లడం, ఆ తరువాత తిరిగి కాంగ్రెస్ లోకి రావడం జరిగిపోయాయి. 2023 డిసెంబర్ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. బీసీ మహిళా మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు. అయితే మంత్రివర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారంపై ఆమె అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కడియం శ్రీహరి వివాదంతో మరో సారి వార్తల్లో నిలిచారు.
సీఎంకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయశాఖ అధికారులతో కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలు, తన అధికార పరిధిని బేఖాతరు చేశారని లేఖలో పేర్కొన్నారు. అధికారులకు గడువులు విధించడం, సమీక్షించడం, పరిపాలనా పరంగా అభ్యంతరకరమని, స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శాఖా మంత్రిని పక్కనపెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి దారితీస్తుందని లేఖలో స్పష్టం చేశారు. అంతేకాకుండా అధికార యంత్రాంగంలో అయోమయ పరిస్థితులకు దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులో కోరారు.






