Konda Surekha : మ‌హోద్యమంలా వ‌న‌మ‌హోత్సవం : కొండా సురేఖ

by Muthe.Rajitha |

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టద‌లిచిన వ‌న‌మ‌హోత్సవం(Vanamahotsavam) కార్యక్రమాన్ని ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు మ‌హోద్యమంలా తీసుకొని ముందుకు వెళ్ళాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు.

Konda Surekha : మ‌హోద్యమంలా వ‌న‌మ‌హోత్సవం : కొండా సురేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టద‌లిచిన వ‌న‌మ‌హోత్సవం(Vanamahotsavam) కార్యక్రమాన్ని ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు మ‌హోద్యమంలా తీసుకొని ముందుకు వెళ్ళాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు. వృక్షో ర‌క్షిత ర‌క్షితః నినాదాన్ని బ‌లంగా ప్రజ‌ల్లోకి తీసుకెళ్ళాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె పున‌రుద్ఘాటించారు. వన మహోత్సవం-2025 పోస్టరు బుధ‌వారం జూబ్లీహిల్స్ లోని త‌న నివాసంలో ఆవిష్కరించారు. పోస్టరు ఆవిష్కరణ‌లో తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షణాధికారిణి (PCCF Hoff) డాక్టర్ సువర్ణ, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, సోష‌ల్ ఫారెస్టు రామలింగం త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ... ఈ ఏడాది తలపెట్టబోయే వనమహోత్సవ కార్యక్రమం వంద శాతం విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. అన్నివ‌ర్గాల వారు ఈ బృహ‌త్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాటిన మొక్కల‌కు నీటి స‌దుపాయం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పండ్ల మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాల్లో జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్ళాల‌ని సూచించారు. 2024 సంవత్సరం డిపార్టుమెంటువారీగా, డిస్టిక్ వారీగా రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు వేసుకోగా... 19.04 కోట్లు నాటినట్టు మంత్రి సురేఖ గుర్తు చేశారు. 95 శాతం మేరకు అంచనాలు రీచ్ అయినట్టు వెల్లడించారు. ఈ సారి 100 శాతం మ‌నం పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాల‌ని దిశానిర్దేశం చేశారు.

ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. గతంలో ఎదురైన అనుభవాలు, తప్పిదాలు పునరావృత్తం కాకుండా అవసరమైన జాగ్రత్తలను అధికారులు తీసుకోవాల‌న్నారు. ప్రతీ ఇంటికి మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించాల‌ని చెప్పారు. ప్రజలు అడిగిన మొక్కలను అందజేయడానికి అధికారులు సిద్దంగా ఉండాల‌న్నారు. ఇండ్లలో ప్రధానంగా పెంచే గులాబీ, మందార, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. పూల మొక్కలను ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించాల‌ని మంత్రి సురేఖ‌ ఆదేశించారు.

గ‌తం కంటే ఈసారి మాన్ సూన్ ముందే వ‌చ్చింద‌ని... ఈ నేప‌థ్యంలో అంద‌రూ స‌న్నద్ధంగా ఉండాల‌న్నారు. ఏ ఏరియాలో ఎటువంటి చెట్లు నాటాలో గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్ళాల‌ని మంత్రి సూచించారు. ఈ ద‌ఫా వ‌న‌మ‌హోత్సవంలో ఈత‌, తాటి, వేప‌, చింత‌, కుంకుడు మొక్కలు నాటించాల‌న్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారికి గుర్తించి ప్రోత్సాహాకాలు ఇవ్వాల‌ని మంత్రి సురేఖ అధికారుల‌ను ఆదేశించారు. మొక్కల పెంప‌కంలో ప్రత్యేకంగా కృషి చేసిన వారికి ప‌లు విధాలుగా గుర్తింపు ఇవ్వాల‌ని అట‌వీ శాఖ ఉన్నతాధికారుల‌కు చెప్పారు.

Next Story