- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Konatham: ‘కొణతం’ విదేశీ టూర్లు.. రూ.18.45 కోట్ల ప్రభుత్వ ధనంతో షికార్లు
బీఆర్ఎస్ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పని చేసిన కొణతం దిలీప్ ఇష్టారీతిన చేసిన ఖర్చులు, నిధుల దుర్వినియోగం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పని చేసిన కొణతం దిలీప్ ఇష్టారీతిన చేసిన ఖర్చులు, నిధుల దుర్వినియోగం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన విదేశీ టూర్ల కోసం రూ.18.45 కోట్లను గత ప్రభుత్వం ఖర్చు చేసినట్టు తేలింది. దిలీప్ చేసినప్రతి పని ఏదో ఒక రకంగా అక్రమం, దుర్వినియోగం, సంపాదనే ధ్యేయంగా సాగిందనేది ప్రభుత్వానికి అందుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిధులను ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేశారని, ఇష్టారీతిన ఉద్యోగులను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిధుల దుర్వినియోగం
గతంలో సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా విడుదలైన నిధుల్లో కొణతం దిలీప్ రూ.కోట్లు దుర్వినియోగం చేసినట్టుగా అంతర్గత విచారణలో తేలింది. తాజాగా ఆయన విదేశీ పర్యటనల కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలు సైతం వెలుగులోకి వచ్చాయి.2016 నుంచి 2023 వరకు ఆయన విదేశీ పర్యటనలకే నాటి ప్రభుత్వం రూ.18.45 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడైంది. ఆర్టీఐ సమాచారం ద్వారా సేకరించిన విషయాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పరిశ్రమలు, ఐటీ శాఖ నుంచి చెల్లింపులు
కొణతం విదేశీ పర్యటనల నిధులను డిజిటల్మీడియా ద్వారా కాకుండా పరిశ్రమలు, ఐటీ శాఖ నుంచి చెల్లించినట్టు అధికారులు గుర్తించారు. ఆయన రవాణా ఖర్చులకే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యటనల పేరుతో అత్యధికంగా 2023లో రూ.13.85 కోట్లు ఖర్చు చేశారు. డిజిటల్ మీడియా డైరెక్టర్ స్థాయిలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగి ఇంత మొత్తంలో ఖర్చు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. పరిమిత కాలానికి ఉండే ఉద్యోగి ప్రతి ఏటా విదేశీ పర్యటనలు చేయడం, దానికి ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పరిధికి మించి అధికారాలు
గత ప్రభుత్వంలో డిజిటల్మీడియా డైరెక్టర్ఆయనకున్న అధికారాలు, పరిధి, ఇవేవి పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ల కన్నాఎక్కువ అధికారాలను ఆయనకు అప్పగించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని అడ్డంపెట్టుకుని ఆయన అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలింది.
టూర్లు ఇలా..
2015 మే, 2016 జూన్, అక్టోబర్‌లో, 2017 మే, 2022 మార్చిలో అమెరికాలో పర్యటించారు. 2018, 2020, 2022 మేలో దావోస్, యూకేలో.. 2023లో యూకేలో పర్యటించారు.
అన్నీ వివాదాస్పదమే..
మొదటి సారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. డిజిటల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి కొణతం దిలీప్‌ను డైరెక్టర్‌గా నియమించింది. నియామకం అయినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా మారాయి. ఆయన వేతనం రాష్ట్రపతి కన్నా ఎక్కువగా ఉన్నదంటూ సోషల్‌మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం కోసం కన్నా బీఆర్ఎస్ కోసం ఆయన అధికంగా పనిచేశారని నాటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. డిజిటల్ మీడియా ప్రభుత్వానికి కాకుండా బీఆర్ఎస్నాయకులకు ఉపాధి కేంద్రంగా మారిందని విమర్శలు చేసింది. బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే వారిపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత, అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, భయభ్రాంతులకు గురి చేశారని, గులాబీ పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ సొమ్మును, ఉద్యోగులను ఉపయోగించుకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించింది.
ఆడిందే ఆట.. పాడిందే పాట
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్మీడియా డైరెక్టర్‌గా కొనసాగిన కొణతం దిలీప్ఏం చేసినా చెల్లిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆయన ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగింది. ఒక కాంట్రాక్టు ఉద్యోగికి అపరిమితమైన అధికారాలు ఇచ్చారని, ఐఏఎస్‌లు సైతం ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని, రాష్ట్ర స్థాయి అధికారులపైనా ఆయన అనేక రకాల ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
నిధుల దుర్వినియోగం..
డిజిటల్మీడియాకు కేటాయించిన నిధులను కొణతం దిలీప్ దుర్వినియోగం చేసినట్టు తేలింది. ప్రభుత్వ ప్రకటనల పేరుతో అవుట్డోర్షూటింగ్ పేరు చెప్పి ఇష్టారీతిన ఖర్చు చేసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆయన వినియోగించిన నిధులపైనా సమాచార శాఖ విచారణ జరిపింది. నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చింది. ఆయన ప్రభుత్వానికి సేవలు అందించాల్సింది పోయి బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించారని అనేక సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన చేసిన అవినీతి, నిధుల దుర్వినియోగం ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా కొణతం దిలీప్విదేశీ పర్యటనల కోసం చేసిన ఖర్చుల వివరాలు...
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఆర్ధిక సంవత్సరం ఖర్చు చేసిన మొత్తం (రూ.లల్లో )
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
2016 ఆగస్టు 1 నుంచి 2017 మార్చి 31 వరకు - 32,72,462
2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు - 51,99,429
2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు - 27,76,394
2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు - 50,35,646
2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు - 51,68,930
2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు - 94,93,980
2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు - 1,50,10,155
2023 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు - 13,85,50,524
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం - 18,45,07,520
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––






