త్వరలో అందుబాటులోకి కొమురవెల్లి రైల్వే స్టేషన్.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రకటన

by Ramesh Naini |

కొమురవెల్లి మల్లన్న స్వామి భక్తులకు త్వరలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ తెలిపారు.

త్వరలో అందుబాటులోకి కొమురవెల్లి రైల్వే స్టేషన్.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొమురవెల్లి మల్లన్న స్వామి భక్తులకు త్వరలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ తెలిపారు. భక్తులకు రైలు సౌకర్యం అందించేందుకు మనోహరాబాద్- కొత్తపల్లి నూతన బ్రాడ్ గేజ్ లైన్‌లో కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్- సిద్దిపేట సెక్షన్‌ను తనిఖీలో భాగంగా కొమరవెల్లి నూతన స్టేషన్ భవనం పనులను సమీక్షించి, ప్రాజెక్టును నిర్ణీత లక్ష్యంలోగా పూర్తి చేయడానికి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన ట్రాక్‌లు, వంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థల భద్రతా అంశాలను సమీక్షించారు. ఈ విభాగంలోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లను పరిశీలించారు. సిద్దిపేట రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా చేసిన తనిఖీలో, ప్రయాణీకుల సౌకర్యాలను సమీక్షించారు. స్టేషన్ మాస్టర్ కార్యాలయం, సర్క్యులేటింగ్ ప్రాంతం, రిలే గదిని పరిశీలించారు. సిద్దిపేట- సిరిసిల్ల మధ్య జరుగుతున్న కొత్త రైల్వే లైన్ పనుల పరిశీలనలో ట్రాక్‌లు, వంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థల భద్రతా అంశాలను సమీక్షించారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు జోన్, డివిజన్‌కు చెందిన సీనియర్ రైల్వే అధికారులు కూడా ఉన్నారు.

Next Story