తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Ajay Maddhiboyina |

గత పదేళ్లలో కనీసం గుంతలు కూడా పూడ్చని దుస్థితి నుంచి, నేడు తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తున్నామని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ. 6,500 కోట్ల రాష్ట్ర నిధులను మంజూరు చేసి రోడ్ల పనులు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు.

తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత పదేళ్లలో కనీసం గుంతలు కూడా పూడ్చని దుస్థితి నుంచి, నేడు తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తున్నామని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ. 6,500 కోట్ల రాష్ట్ర నిధులను మంజూరు చేసి రోడ్ల పనులు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డు సమీపంలో నల్గొండ–దేవరకొండ రహదారిపై రూ.13,006.27 కోట్ల వ్యయంతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) రహదారుల విస్తరణ, బలోపేతం పనులకు సంబంధించిన శంకుస్థాపన పైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం రూ.83 కోట్ల వ్యయంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1 పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నల్గొండ ఎన్‌జీ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.

కనగల్ టు బందర్.. వయా అమరావతి

'హైదరాబాద్-విజయవాడ సిక్స్ లేన్, కనగల్ నుంచి అమరావతి మీదుగా బందర్‌కు గ్రీన్ ఫీల్డ్ హైవే, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు హెచ్ఏఎం పథకం కింద పనులు చేపడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర నిధులు మొత్తం కలుపుకుని సుమారు రూ.78,000 కోట్లతో రహదారుల రూపురేఖలు మారుస్తున్నాం. పరిశ్రమల స్థాపన, స్థానిక యువతకు ఉపాధి లక్ష్యంగా ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో కలుపుతూ డబుల్ రోడ్లు నిర్మిస్తున్నాం. తద్వారా మన పిల్లలు సొంతూరిలోనే ఉపాధి పొందుతూ తల్లిదండ్రులను, వ్యవసాయాన్ని చూసుకునే అవకాశం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వెళ్లే మన ప్రజలందరూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలన్నదే నా తపన, మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రతిపక్షాలవి అర్థరహిత విమర్శలు..

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పేరు పూటకోసారి మార్చుకునే వారు కాంగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా పిలిచిన టెండర్లపై లేనిపోని ఆరోపణలు చేసే ప్రతిపక్ష నేతలు, నైతికత ఉంటే మూసీ బాధితుల దగ్గర నిద్రించి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం ద్వారా నల్గొండకు సాగునీరు అందించి, నాలుగు లక్షల ఎకరాలకు నీరందిస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన ద్వారా కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story