- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు సురక్షితమేనా.. మీరు ఎంత వరకు సురక్షితంగా ఉన్నారు ?
మీరు ఎంత వరకు సురక్షితంగా ఉన్నారు ? రాత్రి వేళ రద్దీ రోడ్లపైనే మత్తుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని ఓ యువతి పోలీసులను ప్రశ్నించింది.

దిశ, సిటీక్రైమ్ : మీరు ఎంత వరకు సురక్షితంగా ఉన్నారు ? రాత్రి వేళ రద్దీ రోడ్లపైనే మత్తుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని ఓ యువతి పోలీసులను ప్రశ్నించింది. ఆమె సోదరుడి కుటుంబం రాత్రి సమయంలో వస్తుండగా, ఘట్‌కేసర్ ప్రాంతంలో కొంతమంది మత్తుబాబులు సృష్టించిన అలజడితో కారులో ప్రయాణిస్తున్న ఆ కుటుంబం భిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురైన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రామంతాపూర్ ప్రాంతంలో ఓ మైనర్ సిగరెట్ తాగుతుండడంతో పాటు, కొంతమంది యువకులు గంజాయి మత్తులో ఉన్నారని స్థానికులు మూడు రోజుల క్రితం పోస్టు చేసిన వీడియో కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
శనివారం మేడిపల్లి దేవేందర్‌నగర్‌లో ఓ ఇంట్లో గృహప్రవేశ వేడుక సందర్భంగా సుమారు 30 మంది అల్లరి మూకలు ఇంట్లోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించారు. మహిళలు, చిన్నపిల్లలు, ఇతరులపై దాడి చేసి గాయపరిచారు. వారు చేసిన హంగామాతో ఆ ఇంటి యజమానులతో పాటు వేడుకకు వచ్చిన బంధువులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇలా మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న ఈ వరుస సంఘటనలు ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో నివసిస్తున్నామని భావించిన స్థానికులకు ఈ సంఘటనలు ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. ఈ ఘటనల్లో మద్యం మత్తులో వీర్రవీగిన అల్లరి మూకల చేష్టలతో అమాయక ప్రజలు ప్రాణాలను కాపాడుకునే క్రమంలో పెట్టిన అరుపులు, కేకలు, ఏడుపులు వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయని స్థానికులు అంటున్నారు.
చట్టానికి గౌరవం లేదు... పోలీసులంటే భయం లేదు...
ఈ అల్లరి మూకల చర్యలను పరిశీలిస్తే పోలీసులంటే భయం లేదని, చట్టానికి గౌరవం లేదని స్పష్టంగా తెలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎవ్వరూ తమను ఏమీ చేయలేరు అనే ధైర్యమే వారిని అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడేలా చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ అల్లరి మూకల వెనుక రాజకీయ బలం ఉండడం వల్లే తమపై పోలీసులు చర్యలు తీసుకోరనే ధీమా వారిలో నెలకొందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక రామంతాపూర్, ఉప్పల్ భాగాయత్ ప్రాంతాల్లో రాత్రి 9 గంటలు దాటితే చాలు నిర్మానుష్య రోడ్లపైనే తిష్ట వేసి మద్యం, గంజాయిని సేవిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు గస్తీని పటిష్ఠంగా నిర్వహిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటే అల్లరి మూకలు, వారిని ప్రోత్సహించే రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసుల చర్యలు నిజంగా సీరియస్‌గా ఉంటే అల్లరి మూకలు ఇంత బహిరంగంగా గొడవలకు దిగే ధైర్యం చేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.






