లక్ష ఎకరాల లక్ష్యాన్ని నెరవేరుస్తా : మంత్రి కోమటిరెడ్డి

by Bhanu |

బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా ఇచ్చిన మాట ప్రకారం లక్ష ఎకరాల లక్ష్యాన్ని నెరవేరుస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

లక్ష ఎకరాల లక్ష్యాన్ని నెరవేరుస్తా : మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, నార్కట్ పల్లి : బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా ఇచ్చిన మాట ప్రకారం లక్ష ఎకరాల లక్ష్యాన్ని నెరవేరుస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కుడి, ఎడమ కాలువ భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. గత ఏడాది మాదిరిగానే రైతులు పంటలు సాగు చేసుకునేందుకు నీటిని విడుదల చేసి భూగర్భ జలాలను పెంచేందుకు అధికారులు కృషి చేయాలి సూచించారు. నల్లగొండ పర్యటనలో భాగంగా బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ విధంగా మాట్లాడారు.


ప్రాజెక్టులోకి రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేశామని 960 క్యూసెక్కుల నీటిని నింపి ప్రాజెక్టు నిండుగా చేస్తామన్నారు. గతేడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి రైతులకు అందించిన విషయం తెలిసిందే అన్నారు. 1800 ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని తగిన నిధులు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. నాకు జన్మనిచ్చిన ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మించడం నా జన్మ ధన్యమని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుపై దృష్టి పెట్టకపోవడంతో ఆలస్యమైన విషయాన్ని వెల్లడించారు.

ప్రాజెక్టుకు చుట్టూ ఉన్నటువంటి చెరువుల్లోకి కాలువల ద్వారా త్వరితగతిన నీటిని విడుదల చేయాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా వర్షాకాలం నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి సామర్థ్యం గా నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ప్రాజెక్ట్ అధికారి గంగం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ ఎల్ వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, జిల్లా నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, ఆర్ ఐ తరుణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story