- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ కాంగ్రెస్‍లో బీసీ వర్సెస్ రెడ్డి.. చిచ్చు రాజేసిన మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
జగ్గారెడ్డికి పీసీసీ పదవిపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో రెడ్డి వర్సెస్ బీసీ వివాదానికి దారితీశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‍లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) మాస్ లీడర్ అని ఆయనకు పీసీసీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామంటూ మాస్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాల్సిన అధికార పార్టీలో, ఉన్నట్టుండి పీసీసీ మార్పు అంశం చర్చకు రావడం ఆసక్తిగా మారింది. దాంతో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పరిస్థితి ఏంటి? అంటూ బీసీ నేతలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
రెడ్డి వర్సెస్ బీసీ:
మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ అనే వివాదానికి తెరలేపినట్లైంది. ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీగా కొనసాగుతున్న తరుణంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డిని పీసీసీ చేయాలని అలా చేస్తే వంద సీట్లు సాధిస్తామని చిట్ చాట్ లో చెప్పడాన్ని బీసీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖనిజావృద్ధి సంస్థ చైర్మన్, కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ స్పందిస్తూ సొంత పార్టీపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. మంత్రి వ్యాఖ్యలు బీసీ నాయకత్వాన్ని కించపర్చడమేనని బీసీల పట్ల ఎందుకంత వివక్ష అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిని చేస్తే కీలకమైన హోదాలో ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్‍మెంట్లు ఇస్తూ పార్టీ పరువు తీస్తున్నారని సొంత పార్టీ మద్దతుదారులే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డిపైనే తీవ్ర ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి ఇప్పుడు ఆయన కేబినెట్ లోనే ఉంటూ బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
హెచ్చరించినా అదే దారి:
తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే పార్టీ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేస్తూ అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని, పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‍లోనే అందరూ స్పందించాలని సూచించారు. అయినా మంత్రి కోమటిరెడ్డి మాత్రం జగ్గారెడ్డి విషయంలో చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చిచ్చురాజేసినట్లైంది.
నా ఉద్దేశం అది కాదు:
తన వ్యాఖ్యలు పార్టీలో వివాదానికి దారి తీస్తుండటంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మహేశ్ కుమార్ గౌడ్‍పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సారథ్యంలోనే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పారు. రంజాన్ వేడుకలకు జగ్గారెడ్డి ఏర్పాట్లు బాగున్నాయి. అందుకే పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని మాత్రమే అన్నారు. ఇప్పుడున్న పీసీసీని తొలగించాలనేది ఉద్దేశం కాదు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.






