- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మునుగోడులో ఎక్సైజ్ Vs ఎమ్మెల్యే.. ముదురుతున్న వైన్ షాపుల వివాదం

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలన విషయంలో మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ఎక్సైజ్ డిపార్ట్‍మెంట్ మధ్య వార్ ముదురుతోంది. తన నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలన, మద్యం నియంత్రణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్స్ షాప్ ఓనర్స్ కు హుకుం జారీ చేస్తుంటే ఎక్సైజ్ శాఖ మాత్రం అదంతా నైచల్తా అంటూ దగ్గరుండి మరీ ఉదయం 10 గంటలకే వైన్సులను తెరిపిస్తుండటం సంచలనంగా మారింది. దీంతో నియోజకవర్గంలోఇప్పుడు కోమటిరెడ్డి వర్సెస్ ఎక్సైజ్ శాఖ మద్య మద్యం రాజకీయం రంజుగా మారింది.
మా సార్ చెప్పిన టైమ్‍కే తెరవాలి:
తన నియోజకవర్గంలో మద్యం నియంత్రణలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా పంతంతో ఉన్నారు. మద్యం షాపుల వేళల విషయంలో ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలకే తెరుచుకుంటుండగా మునుగోడులో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే మద్యం దుకాణాలు తెరవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అంతే కాదు రూల్స్ అతిక్రమిస్తే సహించేది లేదని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆయన హెచ్చరించారు. ఈ ఆదేశాలు ఇప్పటికే మునుగోడు కేంద్రంలో అమలు అవుతుండగా నియోజకవర్గంలోని మిగతా చోట్ల యథావిధిగా ఉదయం10 గంటలకే తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సంస్థాన్ నారాయణపూర్‍లో ఉదయం పూట తెరిచిన వైన్స్ లను కోమటిరెడ్డి అనుచరులు బలవంతంగా మూసివేయించారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే షాపులు తెరవాలని అలా కాదని వ్యవహరిస్తే వ్యవహారం మరోలా ఉంటుందంటూ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.
మీ రూల్స్ నడవవు:
మద్యం షాపులు మూసివేయించడంపై షాప్ యజమానులు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి ఉదయం పూటనే షాపులు తెరిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇవాళ రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు ఉదయం 10 గంటలకే షాపులు తెరిపించారు. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం షాపులు తెరుచుకుంటాయని అలా కాదని బలవంతంగా అడ్డుకుంటామనంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా ప్రజారోగ్యం దృష్ట్యా తాను ఈ సమయపాలన అమలు చేయాలని చెబుతున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతుంటే, తాము టెండర్లలలో పాల్గొని షాపులు దక్కించుకున్నామని, తమకు వ్యాపారాలు జరగకుంటే నష్టపోతామని మద్యం షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్సైజ్ పాలసీ ప్రకారమే వ్యాపారాలు చేసుకుంటున్నామని రాష్ట్రమంతటా లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకని ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా తాజా పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.





