- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మాట తప్పుతోంది.. దిశ కథనంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడులో మద్యం విక్రయాల విషయంలో తానేమి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విరుద్ధంగా మాట్లాడటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అన్నారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్‍లు ఎత్తివేయిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో (Congress manifesto) చెప్పిందని, కాంగ్రెస్ శాసనసభ్యుడిగా తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. మద్యం షాపులకు టెండర్ల నేపథ్యంలో ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మునుగోడు నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు కండీషన్లు పెట్టిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు (liquor tenders) వేసేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నాని దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత నిర్ణయాలపై ప్రభుత్వం సీరియస్‍గా ఉన్నదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 'మునుగోడులో సొంత రూల్స్ నడువవ్' అంటూ మంగళవారం దిశ దినపత్రిక తెలంగాణ ఎడిషన్‍లో కథనం (Disha story) ప్రచురించింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍తో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి దిశ కథనంపై స్పందించారు. తాను దిశ కథనం చదివానని ఈ ప్రభుత్వం వ్యాపారులను ధనవంతులుగా చేసేందుకు పని చేస్తోందా లేక పేద ప్రజల బతుకులు వారి ఆరోగ్యం బాగుండాలని పని చేస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అన్నారు.
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవద్దు:
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మద్యం ఏరులై పారించి పల్లెటూర్ల వాతావరణం పాడు చేశారని ఆరోపించారు. మద్యంతో లక్షల కుటుంబాలు నాశనం అయిపోయాయన్నారు. మద్యం కారణంగా ఎంతో మంది మహిళలు చిన్నతనంలోనే తమ భర్తలను కోల్పోయారని ఇదంతా తాను కళ్లారా చూశానన్నారు. ఉదయం నుంచే తాగి తాగి వాళ్ల సంసారాలు నాశనం అవుతున్నారు. 2014లో మద్యం మీద ఆదాయం రూ.4500 కోట్లు ఉండే దాన్ని ఇప్పుడు 45 వేల కోట్లకు తీసుకుపోయారు. ఇది మంచి ఆదాయమనేనా అని ప్రశ్నించారు. ప్రజల మంచి కోరుకోవాలే తప్ప పథకాల పేరుతో ఓ చేతికి పైసలు ఇస్తూ మరో చేతి నుంచి మద్యం పేరుతో లాక్కోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి. కానీ ఇలా మద్యం తాగించి పేదల కుటుంబాలను నాశనం చేయవద్దన్నారు. తాను మద్యపానం నిషేధించాలని అనడం లేదని మద్యాన్ని నియంత్రించాలని మాత్రమే చెబుతున్నానన్నారు. రోజంతా కష్టపడిన వారు సాయంత్రం కాస్త మద్యం తీసుకుంటే తప్పులేదు. కానీ బెల్ట్ షాపుల వల్ల ఉదయం నుంచే తాగుతూ ఎంతో మంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం:
తాను ఓ ఎమ్మెల్యేనని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై నమ్మకంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు. కేసీఆర్ చేసిన చెడ్డ పనులు, దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల కోసం పని చేయాలని కాంగ్రెస్‍లోకి వచ్చానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించాలని చెప్పారు. నా బాధ్యతగా గెలిపించాను. శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలోని సమస్యను చూసినప్పుడు ఇలా మాట్లాడాలి అనిపించి మాట్లాడాను. ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజం ఉందని అనుకుంటే మద్యం విక్రయాల టైమింగ్స్ మార్చి నాలుగు గంటలే మద్యం విక్రయాలు జరపాలని నిబంధన పెడితే బాగుటుందన్నారు. ఈ టైమ్ టేబుల్ ప్రభుత్వం పెడుతుందా లేదా అది ప్రభుత్వ ఇష్టం అన్నారు. అయినా తాను ఎక్కడా ఓపెన్ స్టేట్‍మెంట్ ఇవ్వలేదని, కేవలం మా నియోజకవర్గం లీడర్లతో చెప్పానని అన్నారు. మద్యపానం నియంత్రించడమే తన లక్ష్యం అన్నారు. మునుగోడులో ఓపెన్ బెల్డ్ షాపులు లేవన్నారు. ఇప్పుడు కూడా వైన్స్ షాపుల కోసం టెండర్లు వేసిన వారికి నేనేమి బెదిరించడం లేదు. వైన్ షాప్ ఓనర్ ఒక్క కుటుంబం కోసం వెయ్యి కుటుంబాలు నాశనం అవుతాయని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే మద్యపాన నియంత్రణకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి తాను సిద్ధమేనన్నారు.
కాంగ్రెస్ మాట తప్పుతోంది:
మంత్రి పదవి వస్తే మద్యం విక్రయాల విషయంలో రాజగోపాల్ రెడ్డి మళ్లీ సైలెంట్ అయిపోతారనే ప్రశ్నకు బదులిస్తూ.. ప్రజలకు మంచి జరుగుతుంటే మంత్రి పదవి కాదు అవసరం అయితే ఎమ్యెల్యే పదవిని సైతం త్యాగం చేస్తానన్నారు. నాకు మంత్రి పదవి ముఖ్యమే కాదని, మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాకు హామీ ఇచ్చిందని ఇచ్చిన మాట మేరకు మినిస్టర్ పోస్టు ఇస్తే తీసుకుంటానన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పని చేస్తానన్నారు. అంతే తప్ప మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మద్యపాన నియంత్రణ కోసం కృషి చేస్తానన్నారు. బెల్ట్ షాపుల విషయంలో హామీ ఇచ్చింది వారే. నెరవేరుస్తారా లేదా వారిచేతుల్లోనే ఉందన్నారు. బెల్డు షాపులపై మాట్లాడుతానని తప్పు చేయనివ్వననే నాకు మంత్రి పదవి ఇవ్వనివ్వడం లేదన్నారు. తాను మంత్రిగా ఉంటే ఈపాటికే ఎప్పుడో స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టించేవాడినని, బెల్డ్ షాపులపై నిషేధం పెట్టించేవాడినని సంచల వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపులపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతోందన్నారు. మహిళలకు రూ. 2500, పెన్షన్లు 4000 కు పెంచుతామన్నారు. కానీ కేసీఆర్ పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రజలకు వివరిస్తున్నానని చెప్పారు. అధికార పక్షంలో ఉన్నాసరే ప్రజల తరఫున మాట్లాడుతున్నాన్నారు. తనకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితోనో మరో వ్యక్తితోనే విభేదాలు లేవని అన్నారు.






