- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం కొల్లాపూర్ ప్రజలు ఎదురుచూపులు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు.

దిశ, కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలంలోని జట్‌ప్రోల్ గ్రామంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రజలు ఈ పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తారని ఆశిస్తున్నారు.
ఈ ప్రాంత ప్రజలు పలు సమస్యలపై సీఎం దృష్టి ఆకర్షించాలని కోరుతున్నారు. వీటిలో ప్రధానంగా సాగునీటి సమస్యలు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం దశాబ్దాలుగా ఎదురుచూపులు ఉన్నాయి. వీరమనాయినేని చెరువును కృష్ణా నదీ నీటితో నింపే ప్రతిపాదనను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. అలాగే ఎల్లూర్ ఎంజికేఎల్ఐ రిజర్వాయర్ నుంచి నల్లమల అడవి గ్రామాలకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలన్నది మరో ముఖ్యమైన డిమాండ్. గత ప్రభుత్వాల్లో శిలాఫలకాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రాజెక్టులు ఆగిపోయాయి.
అలాగే పలు ఆలయాల పునరుద్ధరణ పనులు, మండల స్థాయిలో నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, పాత ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ కూడా ఇప్పటికీ ముళ్ల బాటలోనే ఉన్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ప్యాకేజీ 3లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొల్లాపూర్‌లో ఉన్న ప్రకృతి సౌందర్యంతో కూడిన అమరగిరిని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని, అప్పటికే మంజూరు చేసిన రూ.60 కోట్ల పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. వంతెనల పునర్నిర్మాణం, నిరుద్యోగ యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన వంటివి స్థానికులు కోరుతున్న ప్రధాన అంశాలు.
నల్లమల అడవుల్లో లభించే ఖనిజ సంపద ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని స్థానిక నిరుద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వగ్రామ జిల్లాలో భాగమైన కొల్లాపూర్‌కు తగిన న్యాయం చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.






