- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నియోపొలిస్ ప్లాట్లకు భారీ డిమాండ్.. హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నియోపొలిస్ లేఅవుట్‌లోని ప్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నియోపొలిస్ లేఅవుట్‌లోని ప్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. మూడు దశలుగా ఆరు ప్లాట్లకు నిర్బహించిన వేలంలో హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం వచ్చింది. అధికారుల అంచనాలకు మించి ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మూడు దఫాలుగా నిర్వహించిన ఈ-వేలం ద్వారా మొత్తం రూ.3708 కోట్ల ఆదాయం వచ్చింది.
8 ఎకరాలకు రూ.1000 కోట్లు..
మూడో దశలో ప్లాట్ నెం.19, 20 లకు వేలం నిర్వహించారు. 19వ నెంబర్ ప్లాట్‌ను యులా కన్స్ట్రక్షన్స్ ఎల్ఎల్పీ, గ్లోబస్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ సంస్థలు ఎకరాకు రూ.131 కోట్ల చొప్పున 4 ఎకరాలను రూ.524 కోట్లకు దక్కించుకున్నాయి. ప్లాట్ నెం.20ను బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎకరాకు రూ.118 కోట్ల చొప్పున 4.04 ఎకరాలను రూ.476.72కోట్లతో దక్కించుకున్నది. మూడో దఫాలో వ్యక్తిగతంగా నమోదైన విలువలు ముందటి రౌండ్లలో వచ్చిన అసాధారణ స్థాయిలతో పోల్చితే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం మూడు దఫాలా వచ్చిన సమిష్టి ఫలితం అత్యంత ప్రభావవంతంగా నిలిచిందని అధికారులు చెబుతున్నారు. తాజా లెక్కల ప్రకారం నియోపొలిస్ ఆక్షన్‌ల సగటు ధర ఇప్పుడు ఎకరాకు రూ.137.36 కోట్లకు పెరిగింది. ఇది 2023లోని గత నియోపొలిస్ ఆక్షన్ చక్రంతో పోల్చితే దాదాపు 87శాతం అసాధారణ వృద్ధిని సూచిస్తూ, ఆ ప్రాంతంపై మార్కెట్ నమ్మకం వేగంగా పెరుగుతోందని స్పష్టం చేస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
ఆరు ప్లాట్లకు రూ.3,708 కోట్లు..
కోకాపేట్‌లో సుమారు రూ.300 కోట్లకుపైగా ఖర్చుతో 40 ఎకరాలతో కూడిన నియోపొలిస్ లేఅవుట్‌ను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. ఈ లేఅవుట్‌లో హెచ్ఎండీఏ సకల సౌకర్యాలను కల్పించింది. ఫలితంగానే రికార్డు స్థాయి రేట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఈ లేఅవుట్‌లోని ఎకరాకు హెచ్ఎండీఏ రూ.99 కోట్లు ప్రారంభ ధరగా నిర్ణయించింది. 15 నుంచి 20 వరకు ఆరు ప్లాట్లకు నిర్వహించిన వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. 15వ నెంబర్ ప్లాట్‌లోని ఎకరాకు రూ.151.25 కోట్లు వెచ్చించి 4.03 ఎకరాలను రూ.609 కోట్లతో జీహెచ్ఆర్ లక్ష్మీ ఇన్ ఫ్రా అర్బన్ బ్లాక్స్ సంస్థ దక్కించుకున్నది. 16వ నెంబర్ ప్లాట్‌లోని ఎకరా రూ.147.75 కోట్ల చొప్పున 5.03 ఎకరాలను రూ.743 కోట్లతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది. కోకాపేట్‌లోని నియో పొలిసు లేఅవుట్‌లో 15 నుంచి 20 వరకు ఆరు ప్లాట్లకు ఈ-వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించిన విషయం తెలిసిందే.
రేపు గోల్డ్ మైన్ లేఅవుట్ ఆక్షన్..
నియోపొలిస్‌లో దశలవారీగా విలువలు నిరంతరంగా పెరుగుతుండటంతో, శుక్రవారం (డిసెంబర్ 5న) నిర్వహించనున్న గోల్డెన్ మైల్ ఆక్షన్‌పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ ఆక్షన్‌కు కూడా అభివృద్ధి రంగం నుంచి తీవ్ర ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు మూసాపేట్‌లోని 15ఎకరాలకు సైతం వేలం నిర్వహించనున్నారు.






