ఉద్యమకారులను పిలిచి మాట్లాడతాం: కేకే

by Vemula.Srinu Prasad |

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి రాజకీయ, ఉద్యమ పార్టీల వారి అభిప్రాయాలలు, సలహాలు, సూచనలు స్వీకరించామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే.కేశవరావు తెలిపారు....

ఉద్యమకారులను పిలిచి మాట్లాడతాం: కేకే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి రాజకీయ, ఉద్యమ పార్టీల వారి అభిప్రాయాలలు, సలహాలు, సూచనలు స్వీకరించామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే.కేశవరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఏర్పాటైన గుర్తింపు కమిటీ గురువారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి మబూబాబాద్ ఎంపీ, బలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, న్యూడెమక్రసీ, ఆప్, టీజేఎస్, పార్టీల తరుఫున ఇద్దరు ప్రతినిథులు హాజరై తమ అభిప్రాయాలను కమిటికి తెలిపారు. సమావేశం అనంతరం కే.కేశవరావు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి సంఘాలను, అడ్వకేట్, డాక్టర్, ఉద్యమంతో సంబంధం ఉన్న వారిని కూడా పిలిచి మాట్లాడతామని, కమిటీ మొదటి ప్రాధాన్యతగా అర్హులైన ఉద్యమకారులను గుర్తించడం, వారిని గౌరవించడం, తొలి తరం ఉద్యమకారులను గుర్తించడానికి అనేక సమావేశాలను నిర్వహిస్తోందన్నారు. ఉద్యమకారుల ఐడెంటిటీ పై వర్క్ డివైడ్ చేస్తామని, ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించిన రెండవ మీటింగ్ లో హాజరైన ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలని ఐక్యంగా అందరివి అభిప్రాయాలను తీసుకున్నామని, కమిటీ నివేదిక కు టైమ్ బాండ్ ఆలోచిస్తున్నామని కేకే చెప్పారు. సమావేశానికి హాజరైన ప్రతి పార్టీలు ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారని కేకే తెలిపారు.

ఉద్యమకారులకు గౌరవం ఇస్తాం: మంత్రి పొన్నం

ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ పార్టీలు మాత్రమే కాకుండా ఉద్యోగ, విద్యార్దులు, జర్నలిస్ట్, న్యాయవాదులు అందరినీ పిలిచి మాట్లాడతామని, ఉద్యమంలో గాయాలు పాలైన వారు, వివిధ రకాలుగా నష్టం జరిగిన వారికి న్యాయం చేస్తామని కమిటీ సభ్యుడు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కవులు, కళాకారులు, తెలంగాణ సాధన కోసం పని చేసిన అందరిని గుర్తిస్తామని ఆయన వెల్లడించారు. గుర్తింపు కమిటీ కార్యాలయం అమరవీరుల ద్వీపంలో ప్రారంభం అవుతుందని, ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని, గుర్తించాలని భావిస్తోందని దానిలో భాగంగానే అందరి దగ్గర సూచనలు స్వీకరించామన్నారు. రాజకీయాలకు అతీతంగా సలహాలు సూచనలు స్వీకరిస్తామని, ఆన్లైన్ ఆఫ్ లైన్ లోనూ విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి పొన్నం వివరించారు.

ఉద్యమకారులందరిని కలుస్తాం: కోదండరాం

ఉద్యమకారుల జెఏసీలు చాలా ఉన్నాయని, వారందరిని కలుస్తామని ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం చెప్పారు. అన్ని యూనివర్సిటీల జేఏసీలను కలుస్తామని, సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమంలో జీవితం యవ్వనం పోయిందని, తమను ఆదుకోవాలని కోరుతున్నారని కోదండరాం తెలిపారు.

ప్రజా, విద్యార్థి సంఘాలు, సబ్బండ వర్గాలతో సమావేశం: అద్దంకి దయాకర్

ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సబ్బండ వర్గాలతో సమావేశం అవుతామని, 1969 ఉద్యమకారులను కూడా ఐడెంటిఫై చేయాలని రాజకీయ పార్టీలు చెప్పాయని ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ అన్నారు. చనిపోయిన వాళ్ళు, గాయపడిన వారు, కేసులతో జైలుకు పోయిన వారిని గుర్తించి గౌరవించుకోవాలన్నది సీఎం ఆలోచన అని ఆయన తెలిపారు. మొదటి దశలో రాజకీయ పార్టీల నుండి తీసుకున్నామని, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన, ఉద్యమించిన అన్ని సంఘాల అభిప్రాయాలు తీసుకుంటామని అద్దంకి దయాకర్ చెప్పారు.

Next Story