అదే జరిగితే దోషిగా నిలబడాల్సింది రేవంత్‌రెడ్డి: కిషన్ రెడ్డి హెచ్చరిక

by Gantepaka Srikanth |

ఈనెల 10న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అదే జరిగితే దోషిగా నిలబడాల్సింది రేవంత్‌రెడ్డి: కిషన్ రెడ్డి హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 10న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి మోడీ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. రూ.7,820 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల చేస్తారని.. మరికొన్ని జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. రూ.80 కోట్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నదని.. రూ.85 వేల కోట్ల రైల్వే పనులు సైతం నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 విస్తరణ పనులు కొనసాగుతున్నాయని.. కొంత భూ సేకరణ చేయాల్సి ఉన్నదని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభం అవుతాయని.. తార్నాకలో నేషనల్ సైన్స్ సెంటర్ నిర్మాణంలో ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పనులు కేబినెట్ అనుమతి అవ్వగానే ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. జహీరాబాద్‌లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభిస్తారని.. లక్ష 52 వేల మందికి ఉద్యోగాలు రావాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

10 వేల ఉద్యోగ అవకాశాలు..

జహీరాబాద్ ప్రజలకు పరోక్షంగా 10 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. జహీరాబాద్ బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.1,695 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అలాగే.. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు అవుతున్నదని తెలిపారు. ఎన్నికల సమయంలో పీఎం మిత్ర మెగా కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తామని ప్రధాని మాట ఇచ్చారని.. అదీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 2030 నాటికి 9 లక్షల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హైదరాబాద్ తరువాత అతి పెద్ద నగరం వరంగల్ అని.. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలు కమిట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. జాతీయ రహదారి మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల పనులకు వర్చువల్‌గా పీఎం ప్రారంభిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తుల టెర్మినల్ ప్రారంభించుకోబోతున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మల్కాపూర్ దగ్గర టెర్మినల్ నిర్మాణాన్ని జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. జోగులాంబ, హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేస్తారని చెప్పారు. కాజీపేట నుండి విజయవాడ వరకు రూ.1,243 కోట్లతో మూడో రైల్వే లైన్ పూర్తయిందని.. ఖాజీపేట బైపాస్ రైల్వే లైన్ మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. మొదటి ఫేజ్ ప్రారంభోత్సవాలు మే 10న జరుగుతాయని చెప్పారు. పరేడ్ గ్రౌండ్‌లో ప్రజల తరఫున స్వాగతం పలుకుతామని తెలిపారు.

కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి..

ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గ పనులు చేస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు అడ్డుకున్నారని అన్నారు. 1971లో 55 కోట్ల జనాభా ఉంటే.. ఆ జనాభా ఆధారంగా 543 స్థానాలు ఏర్పడ్డాయని.. ఇప్పుడు దేశ జనాభా 145 కోట్లు ఉన్నదని.. అదే 543 స్థానాలను పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మోదీని ఓడించాలని 145 కోట్ల ప్రజలను ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర వారిని క్షమించదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కొన్ని పార్టీలు అర్థం పర్థం లేని తీర్మానం చేశాయని.. ఎవరికీ అన్యాయం జరగకుండా సీట్ల పెంపు చేసినప్పటికీ కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదన్నారు. ప్రజలే అజ్ఞానులు, ప్రజలదే తప్పు అన్నట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని.. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే దోషిగా నిలబడాల్సింది రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీలే అని హెచ్చరించారు. సీట్ల పెంపు జరిగితే 613 నుండి 920 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు అయ్యేవారని.. దళితులు, మహిళలు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో సంతోషం చూడడమే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని ఆరోపించారు. కుటుంబ రాజకీయం పోతుందనే భయం బీఆర్ఎస్‌కు పట్టుకున్నదన్నారు. చాలా రోజులకు బయటకు వచ్చి ఎంపీలను వెదవలు, చేతకాని వాళ్ళని కేసీఆర్ మాట్లాడుతున్నారని.. గతంలో సీఎంగా చేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ సైతం ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని.. తొండలు, లాగులు అనడం ఇదేం పద్ధతి అని అన్నారు. రెండు పార్టీలు పోటీ పడి అప్పులు చేశాయని.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయన్నారు.

Next Story