- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరుకునే ప్రసక్తే లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
దేశంలో గత యూపీఏ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు అనేకంగా జరిగాయని, అప్పుడు సంఘటనలు జరిగినప్పుడు కేవలం సంతాపాలు ప్రకటించి మరిచిపోయే వారిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో గత యూపీఏ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు అనేకంగా జరిగాయని, అప్పుడు సంఘటనలు జరిగినప్పుడు కేవలం సంతాపాలు ప్రకటించి మరిచిపోయే వారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టిన తరువాత భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, ఐఎస్ఐ నెట్‌వర్క్‌ను అంతం చేసి నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నారు. గురువారం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో మాట్లాడుతూ భారత్‌పై దాడి చేస్తే తాము క్యాండిల్ లైట్స్ వెలిగించం, బ్రహ్మోస్ ప్రయోగిస్తాం అనే ధైర్యాన్ని కనబర్చారు. పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్స్, పఠాన్‌కోట్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు. పెహల్గామ్‌లో భార్యల కళ్లముందే భర్తలను ఉగ్రవాదులు క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను వదిలే ప్రసక్తే లేదని చెప్పిన ప్రధాని మోడీ ఆ మాట ప్రకారమే పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు, ఇంటిని లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ధ్వంసం చేశారు.
కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్ లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశారు. మోడీ మోదీ నాయకత్వంలో ‘న్యూ ఇండియా’ ఆవిర్భవించిందన్నారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ అద్భుత విజయాన్ని సాధించింది. అమాయకుల ప్రాణాలు పోకుండా ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగిందన్నారు. ప్రపంచానికి గుర్తుండిపోయేలా అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో భారత్ సైనిక శక్తిని చాటింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తికాలేదు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించినా, భారత సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఊరుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఈనెల 17న ట్యాంక్ బండ్‌లో నిర్వహించే తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ర్యాలీని విజయవంతం చేయడానికి మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాలు, ఎన్జీవోలు, అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతంగా పాల్గొనేలా పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానం తాకట్టుపెట్టింది :
తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగించడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనమని మండి పడ్డారు. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం. సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగిందన్నారు. అతిథి దేవో భవ మన విధానం కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఇందుకు సోనియా, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.






