- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: రాహుల్‌గాంధీ క్యాస్ట్ ఏంటి..?
తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని.. 42 శాతం రిజర్వేషన్లు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీలాంటి ముస్లింలకు కాకుండా పూర్తిగా బీసీలకే అందేలా వారికే న్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని.. 42 శాతం రిజర్వేషన్లు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీలాంటి ముస్లింలకు కాకుండా పూర్తిగా బీసీలకే అందేలా వారికే న్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వేరే వారికి నీతులు చెప్పే ముందు రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి, బీసీని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు బీసీ-ఈ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని.. ఇలాంటి రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు రెండుసార్లు తీర్పునిచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకుని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ముస్లింలకు 4 నుంచి 10 శాతానికి పెంచి.. బీసీలకు అన్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
రాహుల్‌ది ఏ సామాజికవర్గం?
కులగణన పేరుతో బీసీ జనాభాను భారీగా తగ్గించే ప్రయత్నం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 56 శాతం బీసీలని చెబుతూ.. వారిలో ముస్లింలను 10 శాతం చూపించిందని.. నిజమైన బీసీలు 46 శాతం మాత్రమే ఉన్నారని చెబుతున్నదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎవరికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చేతి వృత్తులపై ఆధారపడి పనిచేసే కులాలకు మాత్రమే రిజర్వేషన్లు అందించారని.. పీఎం నరేంద్రమోదీ తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలోనూ ముస్లిం వర్గాలు లబ్ధి పొందే అవకాశం ఉందని అన్నారు. మళ్లీ బీసీ రిజర్వేషన్లతో కలిపి ముస్లింలకు రాజ్యంగ విరుద్ధంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కుట్ర పన్నిన విషయం తెలిసిందేనని.. 150 మున్సిపల్ డివిజన్లు ఉంటే.. 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేశారని.. అందులో బీసీయేతరులైన మజ్లిస్ పార్టీకి చెందిన వారే గెలిచారని తెలిపారు. బీసీలను ఏదో ఉద్ధరించామన్నట్టు ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ భుజాలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
వేల కోట్లకు పడగలెత్తిన ఒవైసీ లాంటి వ్యక్తులతో మధ్యతరగతి బీసీ పేద కులాల నాయకులు ఎన్నికల్లో పోటీపడి గెలిచే అవకాశం ఉన్నదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లాగా బీసీలకు అన్యాయం చేసేలా తూతూమంత్రపు సర్వేలు చేయబోమని.. తాము చేపట్టే కులగణన రాజ్యంగ బద్ధం చేసి, భవిష్యత్తులో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారం కొల్పోతున్నదని.. వరుసగా మూడోసారి కూడా రాహుల్ గాంధీని దేశ ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోవడం ఖాయమని.. వంద మంది రాహుల్ గాంధీలు కాదు.. వెయ్యి మంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని అన్నారు. రాహుల్‌గాంధీ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధానమంత్రిపై దిగజారిన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని.. ఆయన నామినేటెడ్ ప్రధాని కాదు.. మూడుసార్లు ఆయనపై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని అందించిన విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.






