Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-19 10:18:09  IST  )

బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congrss) పార్టీలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy)సంచలన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుని కేసుల నుంచి బయటపడేందుకు తంటాలు పడుతుందన్నారు.

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congrss) పార్టీలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy)సంచలన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుని కేసుల నుంచి బయటపడేందుకు తంటాలు పడుతుందన్నారు. ప్రజల్లో నానాటికి పలచనవుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిపై పెట్టిన కేసులను అక్రమ కేసులు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంస పాలన చూశామని, ఇప్పుడు 11నెలల కాంగ్రెస్ పాలన చూశామని, రెండు పార్టీలు తెలంగాణను దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాయని ఇప్పటికే రుజువైందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన సాగిందన్నారు. రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధిలో విఫలమై పరస్పరం విమర్శలతో తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు.

హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న రోడ్డు మరమ్మతు పనుల కాంట్రాక్టర్లు కు కూడా బిల్లులు, వీధి లైట్ల మరమ్మతు సిబ్బందికి జీతాలు ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొందన్నారు. ఎక్సైజ్ శాఖ బిల్లులు మళ్లింపుతో చివరకు బీర్లు సరఫరా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో సమస్యలకు, అవినీతికి ఇన్నాళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే బాధ్యత వహించాలన్నారు. మరోవైపు ప్రపంచ మంతా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల బారిన పడితే ప్రధానీ మోడీ నాయకత్వంలో మన దేశం ఆర్థికంగా పురోగమిస్తుందన్నారు. అందుకే తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉందన్నారు.

రాహుల్ గాంధీ ఒకవైపు భారత రాజ్యం మీద పోరాటమంటూ రాజ్యాంగంపై పోరాటం చేస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలకు వంద రోజులు గడిచిపోయాయని, వాటిపై సమాధానం చెప్పాకే రాహుల్ గాంధీ(Rahul Gandhi)తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, దళితులు, రైతులు, వృద్ధులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజ్యాంగం పేరిట ఆందోళనలకు దిగుతున్నారన్నారు.

ఈ దేశంలో అంబేద్కర్ (Ambedkar)ను, రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ తప్ప మరోకటి కాదని, అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వడంతో పాటు చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టడంతో పాటు ఆయన ఐదు స్మారక స్థలాలను పంచ తీర్ధ పేరుతో అభివృద్ధి చేస్తుందన్న సంగతి మరువరాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు గాంధీల కుటుంబ భజన తప్పా మరో నాయకుడిని గౌరవించే సంస్కృతి లేదన్నారు. గాంధీయేతర కాంగ్రెస్ నాయకుల అంత్యక్రియాల్లోనూ వివక్షత చూపారని విమర్శించారు.

పార్లమెంటు ఎన్నికల్లో 8సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు పట్టం కట్టే ప్రభుత్వం రానుందన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా భారత సంవిధాన్ గౌరవ్ అభియాన్ భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అప్పులు చేయడం..దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు యువత బీజేపీలో చేరాలని.. సేవ్ తెలంగాణ, సపోర్టు బీజేపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రానున్న రోజుల్లో అధికారంలో వచ్చేందుకు ముందుడుగు వేయాలని కిషన్ రెడ్డి కోరారు.

Next Story