HCU భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం: కిషన్ రెడ్డి

by Gantepaka Srikanth |

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

HCU భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం: కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షాల గొంతునొక్కతోందన్నారు. ముఖ్యంగా విద్యార్థులను అణిచివేయడం, పచ్చదనాన్ని, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం, నిధుల కోసం హైదరాబాద్ పర్యావరణాన్ని పణంగా పెట్టడంపైనే దృష్టిపెట్టిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వేలం వేయడం.. ఈ ప్రాంతంలోని వృక్షసంపదకు, ఇక్కడ ఉంటున్న జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని పేర్కొన్నారు.

అర్ధరాత్రి పూట కూడా బుల్డోజర్లు పెట్టి చెట్లు నేలకూల్చడంతో.. అక్కడుంటున్న జాతీయపక్షుల(నెమళ్లు) ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. హెచ్‌సీయూ వంటి.. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థుల గొంతులను కూడా అక్రమంగా నొక్కేస్తూ.. ఆక్రమణ చర్యలను మొండిగా చేపడుతుండటం దుర్మార్గమైన చర్య అన్ని విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలేని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపేసి.. హైదరాబాద్ కు ఆక్సిజన్ అందిస్తున్న ఈ ప్రాంతపు అటవీసంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలని కిషన్​రెడ్డి కోరారు.

Next Story