ఏం న్యాయం జరిగింది..? తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి బహరంగ లేఖ

by Satheesh |

రాష్ట్ర సాధనలో నీటి కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి నినదించామని, కానీ రాష్ట్రం వచ్చాక ఈ ‘నీళ్ల’ పేరుతో.. కేసీఆర్ ప్రభుత్వం బహిరంగంగానే దోపిడీకి

ఏం న్యాయం జరిగింది..? తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి బహరంగ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సాధనలో నీటి కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి నినదించామని, కానీ రాష్ట్రం వచ్చాక ఈ ‘నీళ్ల’ పేరుతో.. కేసీఆర్ ప్రభుత్వం బహిరంగంగానే దోపిడీకి పాల్పడిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈమేరకు మంగళవారం తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో గ్రామపంచాయతీల నుంచి మొదలు రాష్ట్ర రాజధాని వరకు ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. ఆ తర్వాత భారీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అంచనాలు పెంచి.. అడ్డగోలు దోపిడీకి కేసీఆర్ బాటలు వేయడం నిజం కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఉద్యమం సందర్భంగా తీసుకున్న ‘నీళ్ల’ నినాదానికి ఏం న్యాయం జరిగినట్లని ఆయన ప్రశ్నించారు. నిధుల విషయంలోనూ ఇదే తంతు అని, మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ కాస్త పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై దాదాపు రూ.1.25 లక్షల అప్పు ఉందని ఓ అంచనాగా ఆయన చెప్పారు. నియామకాల విషయానికొస్తే.. ఉద్యమంలో యువత లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌ను లెక్కచేయకుండా పోరాడినా వారికి ఒరిగిందేమీ లేదన్నారు. నోటిఫికేషన్ లేక వేసినా లీకేజీ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితికి పరిస్థితి చేరుకుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

టీఎస్‌పీఎస్సీ పరిస్థితి మూడు లీకేజీలు, ఆరు రద్దులుగా మారిందని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. పదేండ్లలో కేవలం కేసీఆర్.. కుటుంబాన్ని బంగారుమయం చేసుకుని.. తెలంగాణను బందీఖానాగా మార్చాడని విమర్శలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాల్లో ఒకటైన సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్‌తో కలిసి తెలంగాణను ముుంచడానికే సిద్ధమయ్యాయని కిషన్ రెడ్డి లేఖలో ఘాటుగా స్పందించారు. ఈ పార్టీలు మద్యం, డబ్బు ద్వారా ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తాయని, వారి ఒత్తిళ్లకు లొంగొద్దని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

Next Story