పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామాలు కొంతైనా అభివృద్ధి చెందుతున్నాయంటే, ప్రధాని మోడీ కృషి కారణంగానే జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నుంచి గెలిచిన సర్పంచులను నియోజకవర్గం ఇంచార్జీ అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మొత్తం రూ. 6 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతోంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీలను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇటీవల పార్లమెంటులో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపజేసి, సంవత్సరానికి గరిష్ట పనిదినాల సంఖ్యను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిన ఘనత కూడా మోడీకే దక్కుతుంది. ప్రస్తుతం గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు కలిసి రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని గ్రామాల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గెలుపు దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కమలం గుర్తుపై ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, మనమంతా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తెలంగాణలోని ఇతర కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచేలా కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందుదొందేనని విమర్శించారు. ఇటీవల ఒక పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరడం ద్వారా తమను గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. బీఆర్ఎస్ జెండాపై గెలిచి, సిగ్గువిడిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్నప్పుడు తాము పార్టీ మారలేదని మాట మార్చుస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Next Story