రాజకీయ ప్రయోజనం కోసం రాహుల్​దిగజారారు: కిషన్​రెడ్డి

by Gantepaka Srikanth |

అంతర్జాతీయ స్థాయి ఏఐ సమ్మిట్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు భంగం కలిగించి.. ప్రపంచ దేశాల ఎదుట దేశం పరువు తీయాలని కుట్ర చేశారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రయోజనం కోసం రాహుల్​దిగజారారు: కిషన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ స్థాయి ఏఐ సమ్మిట్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు భంగం కలిగించి.. ప్రపంచ దేశాల ఎదుట దేశం పరువు తీయాలని కుట్ర చేశారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే వేదికగా వినూత్న ఆవిష్కరణలు, గిన్నిస్ వరల్డ్ రికార్డులు వంటి అంశాలు దేశ ప్రతిష్టను పెంచాయి. ఇదే సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో అల్లర్లు సృష్టించారు. కొందరు కార్యకర్తలు సమ్మిట్ వద్ద అర్ధ నగ్నంగా నిరసన తెలపడం అంతర్జాతీయ వేదికపై దేశ ఇమేజ్‌ దెబ్బతీశారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లాభాల కోసం దేశాన్ని ప్రపంచ వేదికపై చిన్నబుచ్చే చర్యలు చేయకూడదు. ఈ సోయి కాంగ్రెస్​లీడర్లకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశాభివృద్ధిని ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి, రచ్చ చేయడం సిగ్గులేని చర్య అన్నారు. రాజ్యాంగం మార్చబోతున్నారని, రిజర్వేషన్లు తీసేయబోతున్నారని దిగజారి రాహుల్​గాంధీ విమర్శలు చేస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా, ప్రజలను తప్పుదారి పట్టించారు. విదేశాలకు వెళ్లిన ప్రతీసారి రాహుల్​భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, పౌర హక్కులను కాలరాస్తున్నారని దేశ గౌరవాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు.

పార్లమెంట్​సాక్షిగా రాహుల్​గాంధీ తప్పుడు ప్రచారం

ఏఐ సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్​ నాయకులు వ్యవహరించిన తీరు ఏమాత్రం క్షమార్హమైన చర్య కాదు. ఈ సంఘటన కాంగ్రెస్​పార్టీలో ఉన్న నిరాశ, నిస్పృహకు అద్దం పడుతోంది. ఢిల్లీ విస్తీర్ణం ఉన్నంత మేరకు చైనా భారత భూమిని లాక్కొందని పార్లమెంట్​సాక్షిగా రాహుల్​గాంధీ తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని ఎక్స్ ఆర్మీ చీప్ నరవణె ఖండించారు. అలాంటి అంశం ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్​ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశ గౌరవాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. దేశం కోసం పనిచేస్తున్న ఎంతో మందిని అగౌరవ పరిచేలా రాహుల్​తీరు కనిపిస్తున్నదన్నారు. దేశంలో ఉన్న జెన్​జీ (యువత) ఆకాంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ నాయకులు ప్రవర్తిస్తున్నారు. వీళ్లు కొన్ని రోజులు పాకిస్తాన్‌కు అనుకూలంగా, కొన్ని రోజులు చైనాకు అనుకూలంగా మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్న టాప్​ 100 కంపెనీలు ఇందులో పాల్గొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తుంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. దేశం అభివృద్ధి చెందకూడదని కాంగ్రెస్​కుట్రలు చేస్తోంది.

Next Story