సింగరేణి స్కామ్‌ బయటపడుతుందనే కిషన్‌రెడ్డిని టార్గెట్ చేశారు: రామచందర్‌రావు

by Malleboina Mahesh |

సింగరేణి స్కామ్ భయంతోనే కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ టార్గెట్.. ప్రభుత్వ బడుల దుస్థితిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్న బీజేపీ చీఫ్ రామచందర్‌రావు!

సింగరేణి స్కామ్‌ బయటపడుతుందనే కిషన్‌రెడ్డిని టార్గెట్ చేశారు: రామచందర్‌రావు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి లో జరిగిన భారీ కుంభకోణం (Scam) బయటపడుతుందనే తీవ్ర భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ రాజకీయ బురదజల్లుతోందని భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. శనివారం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఫణికుమార్‌కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుకు బీజేపీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, అయితే ఆ ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయే బాధితులకు ముందుగా పూర్తి స్థాయిలో న్యాయం చేశాకే పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణశాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. "కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులైనా కేవలం కొన్ని స్కూళ్లలోనే పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. కనీస మౌలిక సదుపాయాలు (Infrastructure) లేని బడులు రాష్ట్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి. దేశంలో కేంద్రీయ విద్యాలయాలకు ఉన్న ఆదరణ, మన రాష్ట్ర ప్రభుత్వ బడులకు ఎందుకు లేదని, ప్రైవేటు పాఠశాలలు ఎందుకు అంతగా పెరుగుతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ (OU) అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి, వర్సిటీల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని రామచందర్ రావు మండిపడ్డారు. తమ హక్కుల గురించి గొంతు ఎత్తే టీచర్లు, ప్రొఫెసర్లను అక్రమంగా సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం భయాందోళనలకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story