ముస్సోరిలో రాధా గాయత్రి మృతి మిస్టరీ.. భర్తపై హత్య ఆరోపణలు, పోలీసులను ఆశ్రయించిన తండ్రి

by Ramesh Naini |

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి (27) కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు కన్పిస్తోంది.

ముస్సోరిలో రాధా గాయత్రి మృతి మిస్టరీ.. భర్తపై హత్య ఆరోపణలు, పోలీసులను ఆశ్రయించిన తండ్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి (27) కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు కన్పిస్తోంది. తన కుమార్తె మరణం వెనుక అల్లుడు శ్రీచరణ్ హస్తం ఉందంటూ గాయత్రి తండ్రి సుధాకర్ స్వయంగా ముస్సోరీ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. తమ అల్లుడు ముమ్మాటికీ సైకో అని, అతడి మానసిక వేధింపుల వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఢిల్లీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్, సాఫ్ట్‌వేర్ కొలువు

విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి సుధాకర్, సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె రాధా గాయత్రి. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమె.. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంకామ్, ఎంబీఏ చేసి, సోషియాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. అనంతరం ఢిల్లీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్ కొలువు సాధించింది. గత ఏడాది నవంబర్ 8 న విశాఖకు చెందిన శ్రీచరణ్ (బిట్స్ పిలానీ విద్యార్థి)తో ఆమె వివాహం జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.

విహారయాత్ర కోసం ముస్సోరీ

దంపతులిద్దరూ విహారయాత్ర కోసం ముస్సోరీ వెళ్లారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉండటంతో 17 (బుధవారం) నాటికి తిరిగి వస్తానని గాయత్రి కుటుంబ సభ్యులకు తెలిపింది. కానీ, జూన్ 15న హోటల్ గదిలో ఆమె అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ముక్కులోంచి రక్తం వస్తుండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

తల్లిదండ్రుల ఆరోపణలు

గాయత్రి మృతిపై ఆమె తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వారు, తాజాగా ముస్సోరీ పోలీసులను ఆశ్రయించారు. శ్రీచరణ్ ప్రవర్తన సైకో తరహాలో ఉండేదని, గాయత్రిపై తీవ్రమైన మానసిక వేధింపులకు పాల్పడేవాడని తల్లి సత్యవతి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్న గాయత్రికి తరచూ వీడియో కాల్స్ చేస్తూ అనుమానించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. బిట్స్ పిలానీలో చదివిన ఉన్నత విద్యావంతుడు కదా అని పెళ్లి చేస్తే, పెళ్లయిన మూడు నెలలకే వేధింపులు మొదలుపెట్టాడని, నిందితుడికి కఠిన శిక్ష పడేవరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

ఆ రాత్రి జరిగిందిదే: భర్త శ్రీచరణ్ వాదన

తనపై అత్తమామలు చేస్తున్న ఆరోపణలపై భర్త శ్రీచరణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోపణలపై తీవ్రంగా ఖండించాడు. తాను గాయత్రిని హత్య చేయలేదని స్పష్టం చేశాడు. ముస్సోరీలో ఆ రోజు రాత్రి ఇద్దరం కలిసి కేక్ తిని, రెడ్ వైన్ తాగి నిద్రపోయామని, ఉదయం లేచి చూసేసరికి ఆమె అచేతనంగా పడి ఉందని తెలిపాడు. ముక్కులోంచి రక్తం వస్తుండటంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లానని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందినట్లు ముస్సోరీ వైద్యులు చెప్పారని వివరించాడు. కూతురు చనిపోయిందన్న బాధలో తనను అనుమానిస్తున్నారని, తమ మధ్య చిన్న చిన్న గొడవలు మినహా ఎలాంటి తీవ్ర విభేదాలు లేవని తెలిపాడు. గాయత్రి బ్యాగ్‌లో ట్రాకర్ ఉందన్న విషయం తనకు తెలియదని స్పష్టం చేశాడు. గాయత్రి తనను ఎంతో ప్రేమగా చూసుకునేదని, ఆమె మరణంతో తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానని, అసలేం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరు వర్గాల వాదనలు, అనుమానాల నేపథ్యంలో ముస్సోరీ పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును అన్ని కోణాల్లో వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

Next Story