సమస్యల పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం: రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్

by Kodari Anjali |

తెలంగాణలో ఆమ్ ఆద్మీని గెలిపిస్తే విద్య, వైద్యం ఫ్రీగా అందిస్తామని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్ అన్నారు.

సమస్యల పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం: రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్
X

దిశ, రాంనగర్: ఏ రాజకీయ నేపథ్యం లేకుండానే, సామాన్య ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైందని, ఢిల్లీలో ప్రజలకు తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో ఆ పార్టీ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్ ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి హేమ సుదర్శన్ జిల్లోజుల ఆధ్వర్యంలో జనత చైతన్య సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక కక్కర్, దిడ్డి సుధాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వాలపై పోరాడారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఉచిత నీటి వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించారని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఢిల్లీ నమూనాను అనుసరించి అమలవుతున్నాయని ఆరోపించారు.

అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది..

ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే నిధులతో అమలవుతున్న పథకాలను వ్యక్తిగత ఘనతగా ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. బాటసింగారం ప్రాంతాల్లో ఆసుపత్రులు, విద్యా సదుపాయాలు తగిన స్థాయిలో లేవని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కూడా మౌలిక సదుపాయాల కొరత ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనను "బుల్డోజర్ రాజ్"గా అభివర్ణించిన వారు, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శించారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇస్తే నాణ్యమైన విద్య, వైద్యం, ఉచిత నీరు, ఉచిత విద్యుత్ వంటి సేవలను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. సభకు హాజరైన ప్రజల్ని వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి హేమ సుదర్శన్ జిల్లోజుల, ముఖ్య నాయకులు బుర్ర రామ గౌడ్, అన్సారి, మహమ్మద్ సోహెల్, సయ్యద్ హైదర్, జావేద్, షరీఫ్, రాజు లతోపాటుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story