- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మీదుగా గంజాయి స్మగ్లింగ్
తెలంగాణ మీదుగా సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

హైదరాబాద్ మీదుగా గంజాయి స్మగ్లింగ్..
రూ.18 లక్షల సరుకు సీజ్..
ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టివేత..
దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ మీదుగా సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. మారేడుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మాటువేసి పట్టుకున్న ఈ దాడుల్లో సుమారు రూ. 18 లక్షల విలువైన 17.42 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బరంపూర్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి భారీగా గంజాయి సరఫరా అవుతున్నట్లు హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ముందస్తుగా పక్కా సమాచారం తో బరంపూర్‌కు చెందిన రాహుల్ సేతి 27 అనే యువకుడు గంజాయి ప్యాకెట్లతో కూడిన బ్యాగుతో రైలెక్కి సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి నేరుగా మారేడుపల్లి స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. నాందేడ్ నుంచి వచ్చే ముఠా సభ్యులకు ఆ గంజాయిని అప్పగించేందుకు రాహుల్ సేతి అక్కడ వేచి ఉన్నాడు.
ఈ సమాచారాన్ని ముందే పసిగట్టిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ తమ సిబ్బందితో కలిసి రాహుల్ సేతిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో ప్యాక్ చేసి ఉన్న గంజాయి బయటపడింది. ఆ ప్యాకెట్లను బయటకు తీసి తూకం వేయగా మొత్తం 17.42 కిలోలు ఉన్నట్లు నిర్ధారించారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుందని సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. స్మగ్లర్ రాహుల్ సేతిని అరెస్ట్ చేసి, సీజ్ చేసిన గంజాయితో పాటు తదుపరి విచారణ నిమిత్తం మారేడుపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.ఈ దాడుల్లో సీఐలతో పాటు ఎస్సైలు శ్రీనివాస్, రూప, భూపాల్, హెడ్ కానిస్టేబుల్ హఫీజ్, కానిస్టేబుళ్లు మురళి, జంగయ్య, శేఖర్, శోభ, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.






