హెచ్‌సీఏ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

by Malleboina Mahesh |

హెచ్‌సీఏ (HCA) నుండి విశాక సంస్థకు ఒక్క రూపాయి రాలేదు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్న గురువా రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానన్న మంత్రి వివేక్!

హెచ్‌సీఏ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) విషయంలో విశాఖ సంస్థపై గురువా రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మంత్రి, విశాఖ గ్రూప్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. తమ సంస్థకు హెచ్‌సీఏ నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదని పేర్కొన్నారు. హెచ్‌సీఏ వద్ద నిధులు లేని సమయంలో, తమ తండ్రి వెంకటస్వామి (కాకా)ను శివ్ లాల్ యాదవ్ కోరడంతో విశాఖ సంస్థ నిధులు సమకూర్చిందని వివేక్ గుర్తుచేశారు. ఈ క్రమంలోనే అప్పటి హెచ్‌సీఏ అపెక్స్, ఏజీఎంలో విశాక పెట్టిన షరతులను వారు అంగీకరించారని తెలిపారు.

2011లో ఐపీఎల్ హక్కుల వివాదం తలెత్తినప్పుడు, అప్పటి హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ రూ.17 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించారని, దీనిపై ఉమ్మడి అఫిడవిట్ దాఖలు చేసినా.. ఇప్పటి వరకు ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదని వివరించారు. టీసీఎ వెనుక కొందరు పెద్ద నేతలు ఉండి నడిపిస్తున్నారని వివేక్ ఆరోపించారు. కాకా వెంకటస్వామి పేరుతో తాను చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ పనుల వల్ల గురువా రెడ్డి వంటి వారి రాజకీయ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే తన పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న గురువా రెడ్డికి ఇప్పటికే నోటీసులు పంపామని, త్వరలోనే పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Next Story