- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టార్గెట్ ఫిక్స్ చేసిన కిషన్ రెడ్డి.. తొలిసారిగా సరికొత్త లక్ష్యం
భాగ్యనగరం చాలా కాలంగా మజ్లిస్ (AIMIM) పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, దానికి త్వరలోనే విముక్తి కల్పిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భాగ్యనగరం చాలా కాలంగా మజ్లిస్ (AIMIM) పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, దానికి త్వరలోనే విముక్తి కల్పిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మజ్లిస్ పార్టీకి పెద్ద పీట వేస్తూ వచ్చాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే స్థానిక, సార్వత్రిక ఎన్నికలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థను విభజించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లలోనూ విజయం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. "మూడు కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగురవేయడమే మా టార్గెట్. మజ్లిస్ అజెండాను మోస్తూ, ఆ పార్టీకీ లొంగిపోయే సంస్కృతికి బీజేపీ చరమగీతం పాడుతుంది. హైదరాబాద్ ప్రజలకు విముక్తి కలిగించే బాధ్యత మాదే" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అవినీతిలో కాంగ్రెస్.. 'బీఆర్ఎస్' తరహా పాలనే!
రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతితో పాలన సాగించిందో... ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అదే తరహాలో కొనసాగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు పెద్దగా తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాల వల్ల తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒక బలమైన ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని.. అది కేవలం భారతీయ జనతా పార్టీ (BJP) మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు, ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ ఘన విజయం సాధించి, జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






