- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించిండు: కిషన్ రెడ్డి
యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించిండు: కిషన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యక్తిత్వం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని, ఆయన గొప్ప మేధావి, కవి, సమర్థుడైన పరిపాలన దక్షుడని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హిందీ భాషలో ఐక్యరాజ్యసమితిలో మొదటిసారిగా ప్రసంగించిన గొప్ప నాయకుడు అన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది నుంచి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్ధలు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కుట్రల కారణంగా కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కోల్పోయినప్పటికీ, నైతిక విలువలకు కట్టుబడి తాను రాజీనామా చేసి అధికారాన్ని వదులుకున్న గొప్ప నాయకత్వం ఆయన సొంతమన్నారు. భారతదేశాన్ని అణుశక్తి సామర్థ్యం కలిగిన దేశంగా తీర్చిదిద్దిన మహానుభావుడు అన్నారు. అమెరికా వంటి అగ్రదేశాలు అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడ్డప్పటికీ, వాటికి భయపడకుండా దేశ భద్రత, దేశ గౌరవం కోసం అణు పరీక్షలకు అనుమతి ఇచ్చారు.
అంతకుముందు అనేక ప్రధానమంత్రులు చేసిన ప్రయత్నాలను అగ్రదేశాలు అడ్డుకున్నప్పటికీ, వాజ్‌పేయి ఆ బెదిరింపులను లెక్కచేయకుండా భారతదేశాన్ని అణుశక్తి సామర్థ్య దేశంగా నిలబెట్టారు. స్వర్ణచతుర్భుజి పథకం ద్వారా దేశవ్యాప్తంగా అద్భుతమైన జాతీయ రహదారులను నిర్మించారు. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేని గ్రామాలకు రహదారి కనెక్టివిటీ కల్పించిన గొప్ప నాయకుడని వెల్లడించారు. సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
పేదల కోసం అంబేద్కర్ ఆవాస్ యోజన తీసుకువచ్చి కోట్లాది మందికి స్వంత ఇళ్లు నిర్మించాడు. యువ హృదయ సామ్రాట్‌గా యువతకు ఆదర్శంగా నిలిచి, జీవితాంతం వారికి స్ఫూర్తినిస్తూ పనిచేశారు. ప్రధానిగా ఉన్నప్పడు పాకిస్తాన్‌తో స్నేహహస్తం అందిస్తూ ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేశారు. పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిన సందర్భంలో భారత సైన్యానికి స్ఫూర్తినిచ్చి, యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించి దేశ భద్రతను కాపాడారు. వాజ్‌పేయి జీవితం సంపూర్ణంగా దేశానికి అంకితమైంది. గొప్ప మేధావిగా, కవిగా ఆయన రచించిన కవిత్వాలు సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ప్రజలను చైతన్యపరిచేలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు డా.ఎన్. గౌతం రావు, వేముల అశోక్ , కార్యదర్శులు బద్దం మైపాల్ రెడ్డి , బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






